Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కూకట్పల్లి
పరికి చెరువును కబ్జాదారుల కబంద హస్తాల నుండి కాపాడి మిషన్ కాకతీయ పథకం ద్వారా సుందరీకరణ చేపట్టి మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాలని పరికిచెరువు పరిరక్షణ సమితి సభ్యులు శేరిలింగంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ఆరికెపూడి గాంధీకి మంగళవారం వినతి పత్రంలో కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ భూదేవి హిల్స్ ఆనుకొని ఉన్న పరికిచెరువు సుమారు 50 ఎకరాలలో విస్తరించి ఉంది. పరికి చెరువులో ప్రైవేటు వ్యక్తులు ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇళ్ల నిర్మాణ వ్యర్ధాలను తీసుకువచ్చి చెరువు పూడ్చి కబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మండల అధికారులు టిప్పర్లను, టాక్టర్లను గుర్తించి పోలీస్ స్టేషన్లో కేసులు బుక్ చేసినప్పటికీ కబ్జాదారుల ఆగడాలు మితిమీరుతున్నాయని గుర్తుచేశారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ దిమ్మలు కూడా కనిపించకుండా తొలగించారని పేర్కొన్నారు. ఇరిగేషన్ అధికారులు అలసత్వం కారణంగా పూర్తిగా చెరువు కనుమరుగైపోతుందని, చెరువు కాపాడాల్సిన వారే వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. మండల అధికారులు అనేకసార్లు కబ్జాలకు పాల్పడిన ప్రాంతాల్లో కూల్చివేతలు కూడా చేపట్టారని, అయినా కూడా కబ్జాదారులు అమాయక ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. నిజాం నవాబులు గొలుసు కట్టు చెరువుగా పంట పొలాలకు తాగునీటికి ప్రజలకు ఇబ్బందులు కలగ కుండా పరికిచెరువును ఏర్పాటు చేశారని స్థానికులు వినతి పత్రంలో తెలిపారు. పరికి చెరువులో గుర్రపు డెక్క పేరుకు పోయి దోమలు, ఈగలు వద్ధి చెంది స్థానికుల కంటిమీద కొనుకు లేకుండా చేస్తున్నాయని, చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో రామకష్ణ, చంద్రశేఖర్ రెడ్డి, గోపాల్, యాదగిరి, సత్యనారాయణ, సుదర్శన్, నాగేశ్వర రావు, ప్రసాద్, ధరణినగర్, చక్రధర్ నగర్, ఆల్విన్ కాలనీ, తులసి నగర్, శ్రీ తులసి నగర్, చక్రధర్ కాలనీ, శివనగర్ వాసులు ఉన్నారు.