Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందుల పాలు చెయ్యవద్దని టీజేఎస్ అధ్యక్షుడు ఆచార్య కొదండరాం అన్నారు. బుధవారం నాడు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా వక్ఫ్ బోర్డు భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతూ వక్ఫ్ బోర్డు బాధితుల పోరాట జేఏసీ అధ్వర్యంలో చేపట్టిన రిలే నిరహర దీక్షకు మద్దతు తెలిపిన కోదండరాం మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల క్రితం లే అవుట్లు చేసి ఇంటి అనుమతులు పొంది, బ్యాంకు లోన్లు తీసుకుని ప్రతి ఏటా పన్నులు కడుతున్న భూములను వక్ఫ్ బోర్డు భూములంటూ నిషేధిత జాబితాలో పొందుపరచడం ప్రజలను ఇబ్బందు లకు గురిచెయ్యడమేనని అన్నారు. కేసీఆర్ సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చెయ్యాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని నిర్వహించి సర్కారు మెడలు వంచి నిషేధిత జాబితా నుండి ఈ భూములు కాపాడుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొ రేటర్లు పోగుల నరసింహ రెడ్డి, కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, కుంభం కిరణ్ కుమార్రెడ్డి, కాలనీల మహిళలు పాల్గొన్నారు.