Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే నినాదంతో పాటలు
- కండ్లు లేకపోయినా తల్లిదండ్రులకు భారం కాకుండా ఆర్కెస్ట్రాతో జీవనం
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
పుట్టుకతోనే రెండు కండ్లు లేని వారు సంగీతంతో జీవనోపాధి పొందుతున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా - సహాయం చేసే చేతు లు మిన్న. అనే నినాదంతో పాటలు పాడుతున్నారు. ఆ నలుగురే మహమ్మద్ సమీర్, ఆంజనేయులు, ఉదరు కుమార్, ప్రమీల. వారు ఒక టీం గా ఏర్పడి ఒక యాప్ ద్వారా సినిమాలో పాడిన పాటలను విని జ్ఞాపకం ఉంచుకొని పాటలు పాడుతూ, హైద రాబాద్లో ప్రతిరోజు ఒక సెంటర్లో ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేసుకుని సినిమాలో పాడిన వారి వలె ఎలాంటి తప్పులు రాకుండా, గొంతు లు కలుపుతూ అద్భు తంగా పాటలు పాడుతూ ఎంతో ఉన్నతంగా జీవిస్తున్నారు. వారితో పాటు వారి తల్లిదండ్రులను పోషిస్తున్నారు. ప్రతిరోజు ఒక సెంటర్లో సాయంత్రం నాలుగు గంటల నుంచి 10 గంటల వరకు పాటలు పాడుతూ, దాతలు ఇచ్చిన ఆర్థిక సహాయంతో జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు నవతెలంగాణతో మాట్లాడారు. తమ పాటలు విన్న దాతలు అనేక మంది పెద్ద మనసుతో ఆర్థికం సహాయం చేస్తున్నారని, వారికి తాము ఎల్లవేళలా రుణపడి ఉంటామని, వారిని ఆ దేవుడు చల్లగా చూడా లని కోరుకుంటున్నామని వారు అన్నారు. ముసారాంబాగ్ లోని అంధుల పాఠశాలలో పదో తరగతి వరకు బ్లైండ్ లిపితో చదువుకున్నామని, అక్కడ ఇప్పటికి 170 మంది బాల ,బాలికలు చదువుతున్నారని, కొంతమంది చదువు అయిపోయిన తర్వాత కూడా అక్కడే హాస్టల్లో ఉంటున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు రావని, నిరాశ చెందకుండా అదేవిధంగా కండ్లు లేని వారము ఏ పని చేయలేమని ఆత్మహత్యలు చేసుకోకుండా, సినిమాలో పాడిన పాటలు వింటూ, తెలుగు, హిందీ పాటలు నేర్చుకొని తమకు కావలసిన పరికరాలను తామే స్వయంగా, తమ కు వచ్చే పెన్షన్ డబ్బులతో ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. కొంతమంది వివాహాలు చేసుకున్నారని, తమ టీమ్ లో ఉన్న ఇద్దరు భార్యా ,భర్తలు అంధులే అన్నారు. అయితే వారికి ఇద్దరు పిల్లలు జన్మించారని ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా పుట్టారని, వారికి ఎలాంటి అవయవ దోషాలు లేవని వారిని చదివించుకుంటున్నామని చెప్పారు.
తమ పిల్లలే తమకు ఇంట్లో అన్ని సహాయ సహకారాలు అంది స్తారని అందువల్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని భార్యా భర్తలు తెలిపారు . అన్ని అవయవాలు బాగా ఉండి, ఆరోగ్యంగా ఉండి, ఆర్థికంగా సహాయం చేసే వారు ఉన్నా కూడా, కేవలం చదువుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలే చేయా లని, ఇక ఏ పని చేయ లేమని అనేక మంది యువతీ, యువకులు ఆత్మహత్యలు చేసు కుంటూ చనిపో తున్నారని, తాము కూడా టీవీలలో వింటామని అది విన్నప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుందన్నారు. కనీసం అలాంటివారు తమను చూసి అయినా, ఏ పని చేసి, అయినా గౌరవంగా జీవించాలని, ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటేనే జీవితాలు కాదని, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని తెలుసుకొని జీవిం చాలన్నారు. మనకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను దుఃఖ పరిచి, చనిపోవడం మంచి పద్ధతి కాదని యువతకు సూచించారు. రాజ శేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు మాత్రమే కొంతమందికి ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమలో చాలామందికి ఆరోగ్యశ్రీ కార్డు లేవని, అదేవిధంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎవరికి ఇవ్వలేదని, కండ్లు ఉన్న వారికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వటం లేదు, ఇక కండ్లు లేని మాకు కేసీఆర్ ఇండ్లు ఎప్పుడు ఇవ్వాలని ఆవేదన వెలిబుచ్చారు .ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అంధులకు, వికలాంగులకు అందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని, అంధులకు ప్రభుత్వ వసతి గహాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తెలుగు, హిందీ పాటలు బాగానే పడతామని, అయినా ఇంత వరకు ఓల్డ్ సిటీలో ఎప్పుడు తాము పాటలు పాడే కార్యక్రమాలు పెట్టలేదని అన్నారు. తాము అందరము పరికరాలతో ఆటోలో వస్తామని ,పాటలు పాడిన అనంతరం తిరిగి ఆటోలో మా ఇండ్లకు చేరుకుంటామని అన్నారు. దాతలు ఎవరైనా తమకు సహాయం చేయాలనుకుంటే మా ఫోన్ నెంబర్లు 9703221525, 7337275371 కు కాల్ చేయవచ్చని, లేదా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆర్థిక సహాయం చేయవచ్చని కోరుతున్నారు.