Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వ బీజేపీ పెద్దలు రద్దు చేయించడాన్ని నిరసిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీభవన్లో ఆదివారం చేపట్టిన సత్యాగ్రహ నిరసన దీక్షకు మేడ్చల్ కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గౌడవెళ్లి బాల్ రెడ్డి మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర ద్వార రాహుల్ గాంధీకి ప్రజలలో వస్తున్న విశేష ఆదరణను తట్టుకోలేకనే ఎంపీ పదవిని దుర్మార్గంగా రద్దు చేయించిందని విమర్శించారు.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలు చేసి తప్పుడు కేసులు పెట్టించి, ఆ కేసులో పడిన శిక్షను ఆధారంగా చేసుకుని పైకోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా ఆగమేఘాల మీద రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయించిందని ఆరోపించారు. ఈ చర్యలతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే దుర్మార్గపు ఆలోచనలను బీజేపీ చేస్తుందని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల వలె రాహుల్ గాంధీకి అండగా నిలబడుతున్నారని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపల్ నాయకులు, ఐఎన్టీయూసీి నాయకులు పాల్గొన్నారు.