Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రహదారులతో పాటు పారిశ్రామిక వాడల్లో ఆర్టీఏ తనిఖీలు
- మరో అయిదు రోజులే గడువు.. ఎంవీఐలపై తీవ్ర పని ఒత్తిడి
- క్వార్టర్లీ ట్యాక్స్ వసూళ్లపై కొనసాగుతున్న ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్
- నేడు అధికారులతో రవాణాశాఖ కమిషనర్ కీలక సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
రవాణాశాఖకు పన్నులు ఎగ్గొటి యథేచ్చగా రోడ్లపై తిరుగు తున్న ట్రాన్స్‌పోర్టు వాహనాలపై ఆర్టీఏ కొరడా ఝళిపిస్తోంది. త్రైమాసిక పన్నులు చెల్లించకుండా తనిఖీల్లో పట్టుబడే వాహనాలపై 200శాతం పెనాల్టీలు విధిస్తోంది. మరోవైపు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పన్నులు చెల్లించే వారికి మాత్రం అపరాధ రుసుము లో 50 శాతం మినహాయింపు కల్పిస్తోంది. మరోవైపు మార్చి 31 సమీస్తుండడంతో ఆర్టీఏ అధికారుల దాడులు తీవ్రతరం చేయడం తో స్వచ్ఛందంగా పన్నులు చెల్లించేందుకు వాహనదారులు ముందు కొస్తున్నారు. దాదాపు 40 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటివరకు 21వేలకుపైగా వాహనాలను తనిఖీ చేయగా.. పన్నులు, పెనాల్టీల రూపంలో రూ.63వేల కోట్లకుపైనే వసూలు చేశారు. ప్రస్తుతం గ్రేటర్ ఆఫీస్లతో పాటు రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలు ట్రాన్స్‌పోర్టు వాహనాలతో నిండి పోయాయి. వీటిని రిలీజ్ చేసే ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నెలన్నర రోజులుగా ఎంవీఐలు చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అంతేగాక తమకిచ్చిన టార్గెట్లు పూర్తి చేసే విషయంలో చాలా కష్టపడుతున్నారనే దాంట్లో సందేహపడాల్సిన అవసరమైతే లేదు. కానీ ఒక్కొ ఎంవీఐపై సుమారు రూ.15లక్షల నుంచి 30లక్షలకు వరకు టార్గెట్లు పెట్టడంతో చాలామంది ఎంవీఐలు ఉదయం 3గంటలకే ప్రధాన రహదారులతో పాటు కంపెనీలు, పారిశ్రామిక వాడల్లో తనిఖీలు చేపట్టడం గమనార్హం. అదే సమయంలో ఆర్థిక సంవత్సరం ముగింపునకు కేవలం అయిదు రోజుల గడువు ఉండడంతో టార్గెట్లు పూర్తి చేసేందుకు ఎంవీఐలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
రూ. 63వేల కోట్లకుపైగా పన్ను వసూలు..!
కరోనా కారణంగా రవాణారంగంపై తీవ్ర ప్రభావం పడింది. అందులోనూ లాక్డౌన్ దెబ్బకు లక్షల సంఖ్యలో ట్రాన్స్‌పోర్టు వాహనాలు ఇండ్లకే పరిమితమయ్యాయి. కానీ ఈ బండ్లు రోడ్డెక్కిన.. లేకున్నా ప్రతి మూడు నెలలకోసారి మోటార్ వెహికల్ టాక్స్‌ను చెల్లించాల్సిందే. అయితే కరోనా కాలంలో ఎలాంటి ఆదాయ మార్గాలు లేకపోవడంతో వాహనదారులు త్రైమాసిక పన్నులు చెల్లించలేకపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా లాక్డౌన్ కాలానికి సంబంధించిన రెండు త్రైమాసికాల వాహన పన్ను రద్దు చేసింది. ఫలితంగా రాష్ట్రంలోని 3.37లక్షల వాహనాలకు రూ.267కోట్ల మోటారు వాహన పన్ను మాఫీ అయ్యింది. కరోనా అనంతరం మార్కెట్ సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ.. చాలామంది వాహన యాజమానులు కొన్ని త్రైమాసికాలుగా పన్నులు చెల్లించడంలేదు. అంతేగాక ఫిట్నెస్, లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి కీలకమైన పత్రాలు లేకుండానే రోడ్లపై యధేచ్చగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు వాహనాల నుంచి బకాయిలను రాబట్టేందుకు రవాణాశాఖ ప్రత్యేక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు 21,347 వాహనాలను తనిఖీ చేశారు. వీటిద్వారా ప్రభుత్వానికి కట్టవలసిన రూ.54.21కోట్ల పన్నులు, పెనాల్టీగా రూ.9.37కోట్లు, మొత్తంగా రూ.63.58 కోట్లు వసూలు చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 16వేల వాహనాల పన్నులు చెల్లించకపోగా ఆ వాహనాలకు సంబంధించి ట్యాక్స్ రూపంలో 12.37 కోట్లు, పెనాల్టీల నుంచి రూ.5.31 కోట్లు రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 5వేలకుపైగా తనిఖీలు చేశారు. వీటిలో పన్నుల రూపంలో రూ.5కోట్లకుపైనే వసూలు చేయగా.. పెనాల్టీ రూపంలో రూ.2కోట్లకుపైగా వసూలు చేయడం విశేషం. ఇదిలావుంటే రాష్ట్రంలో 1.51కోట్ల వాహనాలు ఉండగా.. ఇందులో సరుకు రవాణా వాహనాలు 6 నుంచి 7లక్షల వరకు ఉంటాయని అంచనా. ఇందులో చాలావరకు వాహనాలు ఎప్పటికప్పుడు పన్నులు చెల్లించి రవాణాశాఖ అనుమతులు పొందుతున్నాయి. కొంత మంది యజమానులు కొవిడ్ కారణంగా వచ్చిన నష్టాలకు వాహనాలను స్క్రాప్ కింద అమ్మేసుకోగా.. ఈఎంఐలు చెల్లించని వారివి బ్యాంకులు జఫ్తు చేసుకున్నాయని డ్రైవ్‌లో పాల్గొన్న అధికారులు ద్వారా తెలిసింది. మొత్తంగా ఇప్పటివరకు ఆర్టీఏ అధికారుల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రభుత్వానికి సంతృప్తికరమైన రీతిలో పన్ను వసూళ్లు అయ్యాయి. ఇదే సమయంలో ఏడాది మొత్తంలో చేయాల్సిన టార్గెట్‌ను కేవలం 45 రోజుల్లో చేయమనడంపై చాలామంది ఎంవీఐలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ ఎంవీఐలతోపాటు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు టార్గెట్ల పూర్తికోసం పగలు, రాత్రనకా తిరుగుతుండడంపై వారంతా తమ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కాస్త ఆలోచించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
త్రైమాసిక పన్ను వసూళ్లపై సమీక్ష
రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 15 నుంచి కొనసాగుతున్న త్రైమాసిక పన్ను వసూళ్ల ప్రత్యేక డ్రైవ్‌పై నేడు రవాణాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఆర్టీఏ ఉన్నతాధికారులతో కీలక సమావేశం జరగనుంది. ఇందులో ప్రధానంగా గడిచిన 40రోజులుగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు సంబంధించిన పనితీరు.. వారికిచ్చిన టార్గెట్లపై చర్చించనున్నారు. మరి ముఖ్యంగా ఎంవీఐలు వారిగా ఇచ్చిన టార్గెట్లపై సమీక్ష చేయనున్నారు. ఒక్కో ఎంవీఐ టార్గెట్ ఎంత? ఎంత మేరకు పూర్తి చేశారు? ఇప్పటివరకు ఎన్ని చెక్ రిపోర్టులు రాశారు, వాటి ద్వారా పన్నులు, పెనాల్టీలు రూపంలో ఎంత వసూలు చేశారు అనే అంశాలపై ప్రధానంగా ఆయన అధికారులతో మాట్లాడనున్నారని సమాచారం.