Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
మన్సురాబాద్ గ్రామ కంఠం భూమిలో బీజేపీ కార్పొరేటర్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ఎలా సాధ్యం అని మన్సురాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి విమర్శించారు. మంగళవారం మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని జక్కిడి సత్తి రెడ్డి కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మన్సురాబాద్ బీజేపీ కార్పొరేటర్ రాజకీయ లబ్ది కోసం, తన ఉనికిని చాటుకోవడం కోసం బీఆర్ఎస్ నేతలపై, స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తే సహించం అని హెచ్చరించారు. చిన్న చెరువు వద్ద ఉన్న భూమి తన కుటుంబ వారసత్వ సంపద అని 1963 నుండి కబ్జాలో ఉన్నామని, 2009లో అప్పటి అధికారులు ఎఫ్టీఎల్ హద్దులు నిర్ణయించారని, 2016లో అనుమతి కోసం ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు ఎన్ఓసీ ఇచ్చారన్నారు. 2022 నవంబర్‌లో దరఖాస్తు చేసుకుంటే 3000గజాలకు 5అంతస్థుల వరకు అనుమతులు మంజూరు అయ్యాయని వెల్లడించారు. కానీ స్థానిక కార్పొరేటర్ మాత్రం అనుమతి లేకుండా బార్ నిర్మాణం, చెరువుకు ఆనుకుని ఉన్న స్కూల్ ఏర్పాటు, తన కార్యాలయం ముందు అనుమతి లేని ద్విచక్ర వాహనం షెడ్డు ఏర్పాటు. కాస్మోపాలిటన్ కాలనీలో నిర్మిస్తున్న ఇల్లుకు ప్రస్తుతం జీ01 వరకే అనుమతి వున్నా అదనంగా నిర్మాణం చేయడం ఒక ప్రజాప్రతినిధి అయిన కొప్పుల నర్సింహారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని, నీకు దమ్ము ఉంటే చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఆయన వెంట బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు జక్కిడి రఘువీర్‌రెడ్డి, నర్రి వెంకన్న, ఇరిగి రమేష్, సంరెడ్డి రాజిరెడ్డి, ఏర్పుల యాదయ్య, జగదీష్, సతీష్, టిల్లు, శివశంకర్, సాయి గౌడ్, జెనిగా అఖిల్ పాల్గొన్నారు.
ఎఫ్టీఎల్ రిపోర్ట్‌ను మార్చిన అధికారులు :
కార్పొరేటర్ కొప్పుల
మన్సురాబాద్ చిన్న చెరువు విషయంలో ఎఫ్టీఎల్ హద్దులను రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు స్థానిక బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కు అయి రిపోర్ట్‌ను మార్చారని మన్సురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి ఆరోపించారు. గతంలో చెరువు హద్దులు చెరిపివేశారని, అప్పటి తహశీల్దార్లు చంద్రారెడ్డి, వెంకటేశ్వర్లు హయాంలో 54లక్షల రూపాయల జరిమానా విధించారని గుర్తుచేశారు. అసలు జక్కిడి కుటుంబంది కేవలం 10ఎకరాలు మాత్రమే అని, కానీ స్థానిక యాదవుల భూమి 4ఎకరాలు కబ్జా చేశారని, మాములు వ్యక్తులు అయితే వెంటనే అక్కడికి కూల్చివేసేవారని, వారికి ఎమ్మెల్యే అండ ఉండడం వలన నిర్మాణాలు కొనసాగుతున్నా, వాటిని ఆపాలని అధికారికంగా ఫిిర్యాదు చేసినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. తాను ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తే అధికారులకు ఎందుకు ఫిిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.