Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ గౌతమ్
నవతెలంగాణ- ఖమ్మం
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా ప్రోత్సాహాకాలు అందిస్తున్నాయని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి పథకం - తయారీ సంస్థలు క్రమబద్ధీకరణ క్రింద జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ప్రదర్శన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం ప్రభుత్వాలు వివిధ పథకాల కింద అందిస్తున్న తోడ్పాటు గురించి ఈ సందర్భంగా ఔత్సాహి కులకు అధికారులు అవగాహన కల్పించారు. బ్యాంకుల నుండి సబ్సిడీతో కూడిన రుణ సదుపాయం పొందేందుకు కనీస అర్హతలు, విధివిధానాల గురించి తెలిపారు. సూక్ష్మ పరిశ్రమల స్థాపన కోసం ఉపయుక్తంగా నిలిచే అధునాతన యంత్ర పరికరాల గురించి ఈ ప్రదర్శనలో ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనందున జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం 35 శాతం సబ్సిడీతో కూడిన రుణాన్ని మంజూరు చేస్తుందన్నారు. ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల క్రింద తోడ్పాటును అందిస్తున్నాయని ఆయన తెలిపారు. ఔత్సాహికులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని పరిశ్రమలను విరివిగా ఏర్పాటు చేసినట్లయితే అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రజలకు కూడా ఆహార ఉత్పత్తులు వారి అవసరాలకు సరిపడా అందుబాటులోకి వస్తాయన్నారు. స్వయం సహాయక సంఘాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంఘాలు ఆర్థికంగా బలపడ్డప్పటికి, ఒక స్థిర వ్యాపారం లా కాకుండా రెగ్యులర్ ఖర్చులకు వినియోగిస్తారని, ఒక ఉత్పత్తికి వినియోగించి అభివద్ధి చెందాలన్నారు. స్వయం సహాయక సంఘాలు డ్రోన్స్, హార్వెస్టర్ తదితరాలు తీసుకొని, రైతులకు కిరాయికి ఇవ్వాలన్నారు. మినీ రైస్ మిల్, దాల్ మిల్, కారంపొడి తయారీ ఇలా చాలా రకాల యూనిట్లు ఉన్నట్లు, ఆయా ప్రాంతాలను బట్టి, ఆ ప్రాంతాల్లో దొరికే ముడివనరులను బట్టి యూనిట్ల స్థాపనకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. 10 శాతం లబ్దిదారుడి వాటా, 35 శాతం సబ్సిడీ, 55 శాతం బ్యాంకు ఋణంతో ఒక పరిశ్రమ స్థాపనకు యోచన చేయాలన్నారు. ఒక లబ్దిదారునికి రూ. 16 లక్షల వరకు అవకాశం ఉన్నట్లు, గ్రూపులుగా రూ.4 కోట్ల వరకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. వినూత్నంగా ఆలోచించాలని, యూనిట్ విజయవంతంగా ఉండేట్లు కార్యాచరణ చేయాలని, డిమాండ్ ఉన్న యూనిట్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. చైనా నుండి ఇక్కడికి వచ్చి మిరప ఫ్యాక్టరీల ఏర్పాటు చేస్తున్నారని మనమే ఎందుకు ఏర్పాటు చేయకూడదని ఆయన తెలిపారు. సాంకేతిక సహకారాన్ని అధికారులు అందిస్తారని కలెక్టర్ అన్నారు. మామిడిపండ్ల నుండి పల్ప్, రసం తయారు చేయొచ్చని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పెట్టుబడి కలిసొస్తుందని ఆయన తెలిపారు. దీంతో సంఘాలకు, రైతులకు లాభం చేకూరుతుందని, ఈ దిశగా గ్రూపుల, సమాఖ్యలలో చర్చ పెట్టాలని, యంత్రాల సరఫరాదారుల ఫోన్ నెంబర్లు తీసుకొని, యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిశ్రమల జిఎంలు అజరు కుమార్, సీతారాం, ఖమ్మం డిఆర్డీవో విద్యాచందన, భద్రాద్రి కొత్తగూడెం ఎల్డిఎం రాంరెడ్డి, రాష్ట్ర ఫుడ్ ప్రాసెస్సింగ్ సొసైటీ ప్రతినిధి సంజీవ్, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు బొమ్మ రాజేశ్వరరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.