Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎముకలకు సంబంధించిన వ్యాధి ఈమెను పాఠశాలకు వెళ్ళకుండా చేశాయి. అలాంటి ఆమె ఇప్పుడు వికలాంగ పిల్లలకు పాఠాలు బోధిస్తుంది. ఆమే హెచ్.ఎన్. రమ్య. ఆస్టియోజెనిసిస్ ఇంపెర్ఫెక్టా (ఓఐ)తో బాధపడుతున్నా కుంగిపోలేదు. సమాజానికి తానేంటో చూపాలని నిశ్చయించుకుంది. ఎన్నో ఇబ్బందులు ధైర్యంగా ఎదుర్కొని బెంగుళూరులోని అసోసియేషన్ ఆఫ్ పీపుల్ విత్ డిసేబిలిటీ నిర్వహిస్తున్న పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న ఆమె స్ఫూర్తిదాయక జీవిత పరిచయం నేటి మానవిలో....
ముప్పై మూడేండ్ల రమ్య అసోసియేషన్ ఆఫ్ పీపుల్ విత్ డిసేబిలిటీ (APD) అనే పాఠశాలలో కన్నడ టీచర్‌గా పని చేస్తుంది. వీల్‌చైర్‌కు పరిమితమై ఈ నిర్దిష్ట పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పరిమితులను అర్థం చేసుకోగల ఎవరైనా ఉన్నారా అంటే అది రమ్య అని చెప్పవచ్చు. రమ్య ఆస్టియోజెనిసిస్ ఇంపెర్ఫెక్టా (ఓఐ)తో బాధపడుతోంది. దీనిని సాధారణంగా పెళుసు ఎముక వ్యాధి అని పిలుస్తారు. ఇది పుట్టుకతో వచ్చే అరుదైన జన్యుపరమైన రుగ్మత. పుట్టినప్పుడు రమ్య మూడు నెలలకు మించి బతుకుతుందని వైద్యులు ఊహించలేదు. కానీ మూడు దశాబ్దాల తర్వాత రమ్యను చూస్తే కేవలం ప్రాణాలతో బయటపడటం మాత్రమే కాదు తన మార్గంలో అనేక అడ్డంకులను అధిగమించిన పోరాట యోధురాలు అని వైద్యులు చెప్పారు.
అడ్మిషన్లు తిరస్కరించారు
బెంగళూరు రూరల్ జిల్లాలోని హౌస్కోట్లో తాను పెరిగిన రోజులను గుర్తుచేసుకుంటూ ''నా బాల్యం చాలా భిన్నమైనది. నేను ఎప్పుడూ స్నేహితులతో ఆడలేను. స్కూల్లో ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేను'' అని రమ్య చెప్పింది. ఆమె పాఠశాల రోజుల నుండి తనను అందరూ అంగీకరించడం కోసం పోరాటం ప్రారంభించింది. ఎందుకంటే చాలా పాఠశాలలు ఆమె అడ్మిషన్‌ను తిరస్కరించాయి. ఆమె తల్లి ఒక అంగన్వాడీలో టీచర్‌గా పని చేసేది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. అయినప్పటికీ రమ్య ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదవడం ప్రారంభించినప్పుడు ప్రతిరోజూ కూతురు పాఠశాలకు వెళ్ళి రావడానికి ఆటోను మాట్లాడుకుంది.
అమ్మ వారిని వేడుకుంది
''కాలేజీ వయసుకు వచ్చేసరికి మా అమ్మ దగ్గర్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి వెళ్ళింది. వారు అడ్మిషన్‌ను పూర్తిగా నిరాకరించారు. అయితే అమ్మ వారిని వేడుకుంది. అమ్మను ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాను. అప్పుడే నేను ఆమెకు చెప్పాను, ఆమె ఇకపై ఎవరి ముందు తలవంచబోదని. చదువంటే నాకెంతో ఇష్టం. కాబిట్టి సరైన అవకాశం లభిస్తుందని నాకు తెలుసు. మా పట్టణంలో కాకపోతే మరెక్కడైనా సీటు వస్తుందని అమ్మకు ధైర్యం చెప్పాను'' అంటూ రమ్య గుర్తు చేసుకుంది.
ఎంతో సహకరించారు
ఇలా ఎంతో ధైర్యంగా ఉన్న 17 ఏండ్ల యువతి, ఆమె తల్లి వెంటనే కోలార్ జిల్లాలోని బంధువుల ఇంటికి మారారు. అక్కడ ముల్బాగల్లోని ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాలను సంప్రదించారు. ''అక్కడి అధికారులు నాకు విద్య పట్ల ఉన్న అభిరుచిని వెంటనే అర్థం చేసుకున్నారు. మీలాంటి వాళ్లకు మేం సాయం చేయకపోతే మేమెందుకు అన్నారు. ప్రజలు, వ్యవస్థపై నా నమ్మకాన్ని అది బలపరిచింది'' అని రమ్య చెప్పింది. కాలేజీలో గడిపిన మూడు సంవత్సరాలు తనకు అడుగడుగునా సహాయం అందించారు. వారి సహకారంతో ఉత్తీర్ణత సాధించి. ఆపై కన్నడలో ఎమ్మె పూర్తి చేయడానికి బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి దూరవిద్య ద్వారా దరఖాస్తు చేసింది. అప్పుడే రమ్య పోటీ పరీక్షలకు ప్రయత్నించాలని కలలు కన్నది.
అమ్మే మోసుకుపోయింది
''నేను బ్యూరోక్రాట్ అవ్వాలని అనుకున్నాను. దానివల్ల నాలాంటి ఇతరులకు సహాయం చేయగలను''. అయితే పరీక్షలు రాసిన తర్వాత ఆమెలో ఉత్సాహం తగ్గిపోయింది. ఆ పరీక్షలు నిరాశావాదానికి సరిహద్దుగా మిగిలిపోయింది. రమ్య బెంగుళూరులోని ఒక ప్రసిద్ధ ప్రభుత్వ కళాశాలలో పరీక్షలు రాయవలసి ఉంది. ''పరీక్ష హాలు మూడవ అంతస్తులో ఉంది. అక్కడ లిఫ్ట్ లేదు. నాకు మినహాయింపు ఇవ్వమని అభ్యర్థిస్తే ఎవ్వరూ పట్టించుకోలేదు. నాతో పాటు మా అమ్మ నన్ను మూడు అంతస్తుల పైకి కష్టపడి తీసుకుపోయింది. ఆరోజు అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. పరీక్ష బాగా రాయమని నాకు చెప్పింది'' అని రమ్య చెప్పింది.
సివిల్స్‌కు దూరమయింది
తన అనుభవంతో మనం వెళ్ళే మార్గం సులభం కాదని గ్రహించినప్పుడు తన సివిల్ సర్వీస్ కలలను వదులుకుంది. 2017లో రమ్య ముల్బాగల్లోని శారద కళాశాలలో బీఈడీ చేసేందుకు దరఖాస్తు చేసుకుంది. అక్కడ పాఠశాల తనకు ఎంత అనుకూలంగా ఉందో చూసి ఆశ్చర్యపోయింది. తన ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తర్వాత రమ్యను అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటి (APD) బెంగళూరులోని లింగరాజపురంలోని వారి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా నియమించింది. రమ్య ప్రస్తుతం పాఠశాలకు సమీపంలో అద్దె ఇంట్లో ఉంటుంది. ''అక్కడ నుండి నేను నా ఎలక్ట్రిక్ వీల్‌చైర్‌లో పాఠశాలలోకి జూమ్ చేస్తున్నాను'' అని ఆమె చెప్పింది.
బోధించడం గొప్ప అనుభవం
రమ్య 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు విద్యార్థులకు కన్నడ నేర్పుతుంది. ''నేను నా ఉద్యోగాన్ని పూర్తిగా ప్రేమిస్తున్నాను. కొన్నిసార్లు నేను వీల్‌చైర్‌లో ఉన్నాను అనే వాస్తవాన్ని వారు కూడా ఉపయోగించుకోవడం వలన పిల్లలను నిర్వహించడం కష్టంగా ఉంటుంది. కానీ మొత్తం మీద వికలాంగ పిల్లలకు బోధించడం గొప్ప అనుభవం. వారు ఏమి చేస్తున్నారో నాకు తెలుసు అని నేను భావిస్తున్నాను. కాబట్టి నేను వారితో కనెక్ట్ అవ్వగలను. APD పాఠశాలలో వికలాంగులకు అనుకూలంగా ఉండేలా అన్ని సౌకర్యాలు కల్పించడం అద్భుతంగా ఉంది'' అని రమ్య అంటుంది.
అవగాహన లేదు
''వికలాంగుల కోసం అనేక ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. కానీ 5శాతం రిజర్వేషన్ వంటివి చాలా మందికి పెద్దగా తెలియదు. నాలాంటి వారు మరింత మంది ఈ పథకాల ద్వారా లబ్ది పొందాలని కోరుకుంటున్నాను. ఇటీవల అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం (IDPD)కి ముందు, APD బెంగళూరులోని లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ (ఈస్ట్ గేట్)లో పూర్తి-రోజు ఇంటరాక్టివ్ అవగాహన డ్రైవ్‌ను నిర్వహించింది. వికలాంగులకు బహిరంగ ప్రదేశాల్లో స్కేలింగ్ యాక్సెసిబిలిటీ గురించి అవగాహన కల్పించడం, సమగ్రతను పెంపొందించడం ఈ ఈవెంట్ లక్ష్యం. రమ్య కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యింది. ప్రసిద్ధ బొటానికల్ గార్డెన్‌ను మొదటిసారి సందర్శించడం గురించి ఉత్సాహంగా మాట్లాడింది.
సామాజిక అవగాహన లేక
''నేను ఇప్పటివరకు చాలా నిర్బంధ జీవితాన్ని గడిపాను. ఎప్పుడూ స్వేచ్ఛగా తిరగలేదు. నా APD స్నేహితుల సహాయంతో లాల్బాగ్కి వెళ్లడం చాలా అద్భుతంగా ఉంది. మేము గార్డెన్ చుట్టూ తిరిగాము. అది ఎంత డిసేబుల్ ఫ్రెండ్లీగా ఉందో అంచనా వేసాము. నాలాంటి వారితో ఇంటరాక్షన్ల ద్వారా అందమైన రోజును ఆస్వాదించాము. తల్లిదండ్రులు సామాజిక అవగాహన లేక సంకోచిస్తారు. ఎందుకంటే వారిని చుట్టూ తిప్పడం సులభం కాదు. కానీ మాలాంటి పిల్లలకు చిన్నవయసులోనే ఎక్స్పోజర్ ఇవ్వడం మీరు చేయగలిగిన ఉత్తమమైన పని. ఇది సాధారణ ప్రపంచంలో జీవించడానికి మాకు విశ్వాసాన్ని పెంచుతుంది'' అంటుంది రమ్య.