Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిగతా సమయాల్లో ఎంత స్నేహంగా ఉన్నా.. ఆఫీసుల్లో మీటింగ్ సమయంలో మాత్రం సభ్యుల మధ్య విభేదాలు వస్తుంటాయి. ఒకరి ఆలోచనను మరొకరు వ్యతిరేకించడమే ఇందుకు కారణం. అలాగని అభిప్రాయాలను చెప్పకుండా ఉంటే మనకే నష్టం. మరెలాగంటారా?
ఎవరైనా సానుకూల దృక్పథంతోనే ఆలోచన పంచుకుంటారు. అవునా! అంటే వాళ్లూ మీలాగే ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఉంటారు. కాకపోతే మీ కోణం వాళ్లకి తట్టుండదు. కాబట్టి నిందించినట్టుగా, 'ఆ మాత్రం తెలియదా' అన్న ధోరణిలో మాట్లాడకూడదు. కచ్చితంగా బెడిసి కొడుతుందన్నట్టుగా చెబితే అవతలి వాళ్లకీ అవమానంగా అనిపిస్తుంది. దీంతో గొడవ ప్రారంభమవుతుంది. లోపాలను సానుకూలంగానే ఎలా చెప్పొచ్చో చూడండి. వాళ్లూ అర్థం చేసుకుంటారు.
ఇలాంటిచోట అనుభవం మొదట ప్రస్తావనకి వస్తుంది. 'నీ అనుభవం ఎంత నాకు చెప్పడానికి' అని అవతలివారన్నా.. 'ఇన్నేండ్ల అనుభవం ఉంది నాకు తెలియదా' అని మీరన్నా పొరపాటే. మీ అభిప్రాయాన్ని మీరెలా నమ్ముతున్నారో.. అవతలి వారూ అంతేనని గుర్తుంచుకోవాలి. వారు కోపగించుకుంటే మీరూ అదే దారిలోకి వెళ్లొద్దు. 'మీ ఆలోచన సబబే.. కానీ.. ఫలానా విషయంలో ఇంకాస్త ఆలోచించాలి అనిపించింది, తప్పనిపిస్తే వదిలేయండి' అని ముగించడం మేలు. దృష్టి మీ పాయింట్ చెప్పడంపైనే ఉండాలి.
ఆఫీసులో అందరూ అందరికీ నచ్చాలని లేదు. నిజంగానే భిన్నాభిప్రాయాలు ఏర్పడితే సరే. వ్యక్తి నచ్చక వాళ్ల ఆలోచనని వ్యతిరేకించొద్దు. ముందు వాళ్లు చెప్పేది సానుకూలంగా వినండి. నిజంగానే వ్యతిరేకించాలా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సొంత ఫీలింగ్స్ ప్రభావం చూపట్లేదు అన్నాకే మాట్లాడండి. అలాగే కొద్ది పాటి మార్పులతో ఆలోచనను ముందుకు తీసుకోవచ్చా.. సూచించండి. అవతలి వ్యక్తిని ప్రత్యర్థిగా.. మీకన్నా ముందుకెళ్లిపోతున్నాడని భావించనక్కర్లేదు. వ్యక్తిగతానికీ, పనికీ తేడా చూపించేవాళ్లే దూసుకెళ్లగలుగుతారు.