Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శీతాకాలంలో చర్మ సమస్యలుఎక్కువగా వస్తుంటాయి. ఈ కాలంలోనే మన చర్మ రక్షణకు వివిధ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ తీసుకోకపోతే అనేక సమస్యలతో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమయంలో ఎక్కువగా చర్మానికి మాయిశ్చరైజర్ వాడుతుంటాం. దీని వల్ల బయటకు వెళ్లినప్పుడు చర్మానికి దుమ్ము అంటుకుంటుంది. అలాగే చర్మం ట్యాన్ అయిపోతుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి చర్మానికి బాదం ఆయిల్ రాస్తే మంచి ఫలితాలు వస్తాయని చర్మ సంబంధిత వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఈ సీజన్ విటమిన్ ఈ ఉండే ఉత్పత్తులను వాడడం మంచిది. కాబట్టి ఉత్తమంగా ఉండే ఆల్మండ్ ఆయిల్‌ను వాడితే చలికాలంలో చర్మాన్ని అందంగా మార్చడమే కాకుండా దీర్ఘకాలికంగా ఉండే చర్మ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.
డార్క్ సర్కిల్స్ సమస్య దూరం: ముఖానికి తరచూ బాదం నూనె రాస్తే కండ్ల కింద ఉండే నల్లటి వలయాలు త్వరగా మాయమవుతాయి. బాదం నూనెతో ప్రతిరోజు కండ్ల కింద చేతులతో తేలికగా మసాజ్ చేస్తే కొన్ని వారాల తర్వాత మార్పును గమనించవచ్చు.
ముడతలు: బాదం నూనెలో ఉండే విటమిన్ ఈ కారణంగా చర్మంపై ముడతలు ఈజీగా దూరమవుతాయి. రాత్రి పడుకునే ముందు బాదం నూనెను ముఖానికి రాస్తే ప్రభావవంతమైన ఫలితాలను పొందవచ్చు
మొటిమలు: ముఖంపై మొటిమల సమస్యతో బాధపడేవారు రోజూ ముఖానికి బాదం నూనెను రాసుకుంటే మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం నుంచి బ్యాక్టీరియాను తొలగించడానికి సాయపడుతుంది. అలాగే లోపల నుంచి రంధ్రాలను శుభ్రం చేస్తుంది.
చర్మం పగుళ్ల సమస్య మాయం: చలికాలంలో చర్మం పొడిబారడం వల్ల పగుళ్లు వస్తాయి. పగుళ్లు వచ్చిన చోట ఎర్రబడి విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ బాధ నుంచి రక్షణకు బాదం నూనె వాడవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మంలోని తేమ కరెక్ట్‌గా మెయిన్ టెయిన్ అవుతుంది. అలాగే బాదం నూనె వల్ల చర్మానికి మంచి పోషణ అందుతుంది.
చుండ్రు నుంచి రక్షణ: శీతాకాలంలో ఒక్క చర్మమే కాదు జుట్టు కూడా వివిధ సమస్యలకు గురవుతుంది. అందులో ముఖ్యమైంది చుండ్రు సమస్య. స్కాల్ప్‌పై చుండ్రును గమనించిన వెంటనే బాదం నూనెతో వారానికి ఓ సారి మసాజ్ చేస్తే మెరుగైన ఫలితాలను పొందవచ్చు.