Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న బీర్ల ఐలయ్య ప్రస్థానం
- బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
- నియోజకవర్గ అభివద్ధికోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
నిరుపేద కుటుంబంలో జననం,హాస్టల్లో విద్యాభ్యాసం,అమ్మ రెక్కల కష్టం చూసి చలించి విద్యతో పాటు వ్యవసాయం చేసుకుంటూ జీవనం, అదే సమయంలో ప్రజా సేవ చేయాలనే తలంపు, ఒక వైపు కుటుంబం ఆర్థికంగా నిలబెట్టుకునేందుకు కష్టపడుతూనే, మరోవైపు గ్రామంలో ఉన్న ప్రజా సమస్యలపై దష్టిసారించి ప్రధమ పౌరుడు గా(సర్పంచ్)గెలుపొందడం. అనంతరం రాజకీయాల్లో అంచలంచలుగా ఎదుగుతూ ఒక జాతీయ పార్టీకి నియోజకవర్గ ఇన్చార్జిగా ఎంపికై,ప్రజలకు మరింత సేవ చేసేందుకు బీర్ల ఫౌండేషన్ ఏర్పరిచి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ మరోవైపు తన పదవికి న్యాయం చేసేలా ప్రతిపక్ష హోదాలో నియోజకవర్గ అభివద్ధికి ముందుకు నడుస్తున్న నాయకుడు బీర్ల ఐలయ్య..
యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో జన్మించిన బీర్ల అయిలయ్య చిన్ననాడే తండ్రి మరణించడంతో తల్లి సంరక్షణలోనే విద్యాభ్యాసం కొనసాగించాడు. కొంతకాలం హాస్టల్లో ఉండి చదువుకున్న ఆయనతర్వాత తల్లి కి అండగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ తన విద్యను కొనసాగించాడు.1991లో ఆయన పదో తరగతి చదివే సమయంలోనే మదర్ డెయిరీ పాల ఉత్పత్తి దారుల సంఘంకు చైర్మెన్‌గా ఎన్నికయ్యాడు. అప్పుడే ఆయన రాజకీయాలపై ఆసక్తి ఏర్పరుచుకుని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగాడు. చదువు పూర్తయి ఆర్థికంగా ఎదిగాక 2006లో కాంగ్రెస్ నుండి సైదాపురం సర్పంచిగా ఎన్నికయ్యాడు. ప్రజాసేవ ద్యేయంగా కొనసాగుతూ తమ సొంత గ్రామం రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ తరపున ఎంపీటీసీగా నిలబడి భారీ మెజార్టీతో గెలుపొందారు. (మండలంలో మెజారిటి సీట్లు కాంగ్రెస్‌కు రాకపోవడంతో ఎంపీపీ కాలేకపోయాడు). కొంతమంది ఐలయ్యను బిక్షమయ్య మనిషి అనే వారు, కానీ ఐలయ్య మొదటి నుండి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరు ఉంది. బిక్షమయ్య ఎమ్మెల్యే కాకముందే కాంగ్రెస్ తరపున సర్పంచ్‌గా ఐలయ్య గెలుపొందాడు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలతో బిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్లోకి వెళ్లిపోవడంతో ప్రస్తుత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పగ్గాలు బీర్ల ఐలయ్య చేపట్టాడు. తదనంతరం వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు ఎంపీపీ లు, రెండు జెడ్పీటీసీలను కాంగ్రెస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయం మేరకు యాదగిరిగుట్ట బాధ్యతలు తీసుకున్న ఐలయ్య 12 సీట్లకు గాను మిత్రపక్షాలతో ఏడు సీట్లను గెలిపించుకుని తన సత్తా చాటాడు.
బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు
ఆలేరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో మూడేళ్ళ క్రితం బీర్ల ఫౌండేషన్ కు శ్రీకారం చుట్టారు.బీర్ల అయిలయ్య చైర్మన్ గా 9మంది డైరెక్టర్లు గా ఫౌండేషన్ ఏర్పడింది. ప్రజలందరికీ స్వచ్ఛమైన నీటిని అందించాలని ఉద్దేశంతో నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఇప్పటికే వందకు పైగా గ్రామాల్లో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. వైద్యంలో ప్రజల ఇబ్బందులను గమనించి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు,3 అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులో ఉంచారు. నిరుపేద విద్యార్థులకు విద్యాభ్యాసం కొరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. నియోజకవర్గంలోని పేద ప్రజలు చనిపోతే దహన సంస్కారాలకు 5000 ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం కూడా ఉచితంగా అందజేస్తున్నారు.కరోనా ఆపద కాలంలో కూడా బీర్ల పౌండేషన్ సేవలను అందించింది. కార్మికులకు,జర్నలిస్టులకు నియోజకవర్గ వ్యాప్తంగా నిరుపేదలకు ఉచితంగా నిత్యావసరాలను అందజేశారు. ఇటీవల కొండపైకి ఆటోలను అనుమతించకపోవడంతో ఉపాధి కోల్పోయిన 300 మంది కార్మికులకు 25 కిలోల చొప్పున బియ్యం కూడా బీర్ల ఫౌండేషన్ ద్వారా పంపిణీచేశారు.
నియోజకవర్గ అభివద్ధి పై కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాట కార్యక్రమాలు
ఒకవైపు ప్రజలకు సేవ చేస్తూనే మరోవైపు ప్రభుత్వం ఆలేరు నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులపై చిన్నచూపు చూస్తుందని,గ్రామాల అభివద్ధికి నిధులు ఇవ్వడం లేదని ,రైతులను ఇబ్బంది పెడుతుందని ,ఆరోపణలు గుప్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జిగా పోరాట కార్యక్రమాలను బీర్ల ఐలయ్య రూపొందిస్తున్నారు. బస్వాపురం ప్రాజెక్టులో నిర్వసితులు అవుతున్న వారికి సరైన న్యాయం చేయడం లేదని ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. ముంపు బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన హెచ్చరిస్తున్నారు. ఆలేరుకు జీవనధారమైన గంధమల్ల ప్రాజెక్టును ఎందుకు ప్రారంభించడం లేదో చెప్పాలని పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గంధమల్ల ప్రాజెక్టు పనులు పూర్తయితే ఆలేరు సస్యశ్యామలం అవుతుందని ప్రాజెక్టు పనులు ప్రారంభం అయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని, గంధమల్ల సాదనే నా జీవిత లక్ష్యం అని ఐలయ్య పేర్కొంటున్నారు. గ్రామాలలో మౌలిక సదుపాయాలకు నిధులు ఇవ్వకపోవడంతో అభివద్ధి కుంటుపడిందని కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటాలు కూడా నిర్వహించారు. రైతులకు ప్రస్తుత ప్రభుత్వం అన్యాయం చేస్తుందని, కాంగ్రెస్ వస్తేనే రైతు రాజ్యం ఏర్పడుతుందని ఆ పార్టీ వరంగల్ డిక్లరేషన్ తీసుకురావడంతో ఆ డిక్లరేషన్‌ను ఆలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రైతులకు చేర్చే బాధ్యతను ఐలయ్య తన భుజాలపై వేసుకున్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లోని పలు గ్రామాల రైతులను కూడా కలిసి రైతు డిక్లరేషన్ పై వివరించారు. ఇలా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ, పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపు విజయవంతం చేస్తూ ఆలేరు నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆలేరును కాంగ్రెస్ అడ్డగా మార్చేందుకు నిరంతరం పాటుపడుతూ ప్రజా నాయకుడిగా బీర్ల ఐలయ్య ముందుకు నడుస్తున్నాడు.