Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమలుకు నోచుకోని విద్యాశాఖ మంత్రి హామీ...!
నవతెలంగాణ-మిర్యాలగూడ
పాఠశాలల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల పదోన్నతులు పూర్తిచేస్తామని స్వయంగా విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చి నెల రోజులు గడిచిపోయినప్పటికీ నేటికి పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయకపోవడంతో మంత్రి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధనాయక్ అన్నారు.సోమవారం మిర్యాలగూడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పలుమార్లు చర్చలు జరిపి పాఠశాలల ప్రారంభానికి ముందే అన్ని రకాల పదోన్నతులను పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. విద్యా శాఖలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు అలాగే ఉన్నాయని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఎలాంటి పదోన్నతులకు ఉపాధ్యాయులు నోచుకోలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేక జీవో తీసుకువచ్చి అన్ని రకాల పదోన్నతులు కలిగిస్తామని ఇచ్చిన హామీ సంవత్సరాలు గడుస్తున్న అమలు కాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర నిరాశ నిస్పహలో ఉన్నారన్నారు. స్కూల్ అసిస్టెంట్, జి హెచ్ ఎం, డిప్యూటీ డీఈఓ, యమ్ ఈ వో,డైట్, బీఈడీ కళాశాల లెక్చరర్లు,జూనియర్ కళాశాల లెక్చరర్ పోస్టులు పద్ధతులతో భర్తీ చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని మండలాల ఎంఈఓ డిప్యూటీ డీఈవో పోస్టులు ఖాళీగానే ఉన్నాయన్నారు. ప్రభుత్వం,విద్యా శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా ప్రత్యేక చొరవ చూపి ఉపాధ్యాయ పదోన్నతులపై చర్చించి తక్షణం షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఉద్యోగ సంఘం నాయకులు రవి నాయక్,రవీందర్ నాయక్, కోటియా నాయక్, సైదానాయక్, హరి నాయక్ తదితరులు ఉన్నారు.