Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్టు ఉంది మోత్కూరు మున్సిపల్ అధికారుల తీరు. ఉన్నవాటికే రంగులేసి తామే చేశామన్నట్టుగా ఓ బోర్డు కూడా పెట్టారు. గ్రామీణ క్రీడాకారులు, యువత క్రీడల్లో రాణించాలన్న లక్ష్యంతో సాధన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో, మున్సిపల్ కేంద్రాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా మోత్కూరు మున్సిపాలిటీలో వార్డుకొకటి చొప్పున 12 వార్డుల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా 2వ వార్డు పరిధిలోని ఉన్నత పాఠశాలలో, 12వ వార్డు పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలోని కొంత స్థలంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ఎకరం లేదా అర ఎకరం స్థలంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాల్సిఉంది. అందులో ఖోఖో, వాలీబాల్, కబడ్డీ కోర్టులు, వ్యాయామం చేసేందుకు ఇనుప పైపులతో డబుల్ బార్, సింగిల్ బార్, లాంగ్ జంప్ పిట్ ఏర్పాటు చేయాలి. కాని ఉన్నత పాఠశాలలో ఇదివరకే ఇవన్నీ క్రీడా కోర్టులు ఉండగా పాత ఇనుప పైపులకే కొత్తగా చేసినట్టుగా రంగులు వేశారు. లాంగ్ జంప్ పిట్ కూడా అర మీటర్ లోతుతవ్వి మెత్తటి మట్టి లేదా ఇసుకతో నింపాల్సి ఉండగా అలా చేయలేదు. ఆడుతున్న సమయంలో క్రీడాకారులకు దెబ్బలు తగలకుండా కోర్టులను మెత్తటి మట్టి పోసి చదును చేయాలి. ఇవేవీ చేయకుండానే తెలంగాణ క్రీడా ప్రాంగణం అని ఓ బోర్డు మాత్రం పెట్టారు. అదే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణ స్థలం కంప చెట్లతో ఉండగా వాటిని జేసీబీతో తొలగించి, సుమారు 50 టిప్పర్ల మట్టి పోసి చదును చేసి, కొత్త ఇనుప పైపులు నాటి క్రీడా కోర్టులు, డబుల్, సింగిల్ బార్లు ఏర్పాటుచేశారు. ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణాన్ని ఈనెల 2న మున్సిపల్ చైర్మన్ ప్రారంభించగా, 12వ వార్డులోని క్రీడా ప్రాంగణాన్ని త్వరలో ఎమ్మెల్యే చేత ప్రారంభించనున్నారు. మిగతా పది వార్డుల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొత్తగా వసతులు కల్పించకుండా ఉన్నత పాఠశాలకు చెందిన క్రీడా కోర్టులు, పైపులకే రంగులేసి క్రీడా ప్రాంగణమని బోర్డు పెట్టడమేమిటని ఉన్నత పాఠశాలకు రోజూ వ్యాయామం కోసం వచ్చే వాకర్స్, యువకులు ప్రశ్నిస్తున్నారు. కాగా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగణాలకు రూ.4 లక్షలు (ఒక్కో క్రీడా ప్రాంగణం కోసం) ఉపాధి హామీ నిధుల నుంచి ఖర్చు చేస్తుండగా, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలకు ఎంత ఖర్చు చేయాలన్నది, ఆ నిధులను పట్టణ ప్రగతి నిధుల నుంచా లేక జనరల్ ఫండ్ నుంచి ఖర్చు చేస్తారా అన్నది మాత్రం మున్సిపల్ అధికారులు చెప్పడం లేదు. ఉన్నత పాఠశాలలో ఉన్నవాటికే రంగులేసి పెట్టిన క్రీడా ప్రాంగణానికి ఏ ఫండ్ నుంచి నిధులు డ్రా చేస్తారో వేచి చూడాలి.
మున్సిపల్ కమిషనర్ వివరణ
ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ వివరణ కోరగా ఉన్నత పాఠశాలలో హెచ్ఎం అనుమతి తీసుకునే క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశాం. కొత్తగా డబుల్ బార్ ఏర్పాటుచేసి క్రీడా ప్రాంగణం కోసం అన్ని వసతులు కల్పించాం. మున్సిపాలిటీలో రెండు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశాం. క్రీడా ప్రాంగణాలకు ఏ నిధుల నుంచి ఖర్చు చేయాలన్నది ప్రభుత్వం నుంచి గైడ్ లైన్ రాలేదు.