Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ భూములను అమ్ముకునే కుట్రను మానుకోవాలి
- డిపోను పునరుద్ధరించే వరకు ప్రజలు ఉద్యమరూపంగా ముందుకురావాలి
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మలవీరారెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
ఆర్టీసీ స్థాపనకు పునాదులు వేసి నైజాం రైల్వే రోడ్డు రవ్షాణా సంస్థ నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు నడకలు నేర్పిన నార్కట్‌పల్లి బస్‌డిపో ఆనాటి నిజాంకాలం నుండి ఈ డిపో కొనసాగుతోంది.అలాంటి డిపోను నష్టాల సాకుతో నైజాం నవాబు ఆర్టీసీకి ఇచ్చిన భూములు అమ్ముకునేందుకు ఆర్టీసీని నిర్వీర్యం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి హెచ్చరించారు.మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నార్కట్‌పల్లి మండలకేంద్రంలో 80 బస్సులు ఉన్న డిపోను మూసివేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మూసివేసేందుకు కుట్ర జరుగుతుందని చెప్పారు.1932 జూన్‌లో నార్కట్‌పల్లి బస్‌డిపో 8:30 ఎకరాలు భూమి కలిగి ప్రారంభమైంది.రాష్ట్రంలోనే రెండో బస్డిపోగా స్థాపించబడిందన్నారు. ఆర్టీసీ భూమిని ప్రయివేట్ వాళ్లకు అమ్ముకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కుమ్ముక్కై అమ్మకానికి పెడుతున్నారని ధ్వజమెత్తారు.నార్కట్‌పల్లి పట్టణాన్ని వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా అభివద్ధి కావడానికి డిపో కీలకంగా మారిందని పేర్కొన్నారు.జాతీయ రహదారి వెంబడి రోజు వేల మందికి సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడంలో డిపో సేవలందించిన విషయాన్ని గుర్తు చేశారు.డిపోను ఎత్తివేసే కుట్రలో భాగంగా కార్మికులను ట్రాన్స్ఫర్ చేసి బస్సులను ఇతరడిపోలకు తరలించి నామమాత్రంగా ఇరవై బస్సులతో తాత్కాలికంగా నడుపుతున్నారన్నారు.ఇందులో కూడా 16 ప్రయివేట్ బస్సులు ఉన్నాయని, కేవలం నాలుగు బస్సులు మాత్రమే ఆర్టీసీ సంస్థవి ఉన్నాయన్నారు.డిపో చరిత్రను మంట కలిపే విధంగా కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.డిపో విషయంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు రక్షించుకోవడానికి పలు దఫాలుగా పోరాటాలు కొనసాగించడం జరిగిందని, అయినప్పటికీ ఈ డిపోను నీరుగార్చడానికి ఈ ప్రభుత్వంలో ఆర్టీసీ ఎండి సజ్జనార్‌ను అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారన్నారు.దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ ఉద్యమపరంగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. నార్కట్‌పల్లి బస్‌డిపో నుంచి తరలించిన బస్సులు, సిబ్బందిని వెంటనే తిరిగి రప్పించాలని,ఆర్టీసీ భూములను అమ్ముకునే కుట్రను మానుకోవాలని హెచ్చరించారు.డిపోకు పూర్వ వైభవం తెచ్చేందుకు నియోజకవర్గంలోని ప్రజలని చైతన్యపరిచి సమీకరించి అందరితో కలిసి పోరాడుతామన్నారు.