Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యథేచ్ఛగాస్థలంలో మట్టితో చదును
- ఎకరంన్నర స్థలంకబ్జా
- స్థలాన్ని గుర్తించి హద్దులుపెట్టాలి:ఆవాజ్ కమిటీ
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాకేంద్రంలో నడిబొడ్డున ఉన్న వక్ఫ్‌బోర్డు స్థలం కబ్జాలతో అన్యాక్రాంతమవుతుంది.కోట్లాది రూపాయల విలువ గలిగిన భూమి ఇక్కడ ఉండడంతో ప్రతిఒక్కరి ''నజర్'' దీని పైనే పడింది.ఇప్పటికే కొద్దిగా కొద్దిగా స్థలం కబ్జాలకు గురై ఎకరంన్నర స్థలం రానురాను కుదించుకుని పోతుంది. ఆనాటి కాలం నుండి ఇప్పటివరకు స్థలాన్ని ముతవల్లి కొద్దికొద్దిగా విక్రయిస్తూ వచ్చాడు.వాస్తవానికి వక్ఫ్‌బోర్డు స్థలం రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉండవు.మరి కొనుగోలు చేసిన వారు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారో తేలాల్సి ఉంది.ఇప్పుడు తాజాగా అదేస్థలంలో శుక్రవారం టిప్పర్లతో మట్టి తీసుకొచ్చి స్థలంలో పోస్తున్నారు. జేసీబీ ద్వారా స్థలాన్ని చదును చేయిస్తున్నారు.వక్ఫ్స్థలంలో ఈ తతంగమంతా జరుగుతున్నా సంబంధిత అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో చూస్తే... పట్టణంలోని కొత్త ఫైర్‌స్టేషన్ వద్ద,కిరాణం ఫ్యాన్సీ భవనం ప్రక్క వీధిలో 632 వ సర్వేనెంబర్లో వక్ఫ్‌బోర్డుకు చెందిన దాదాపు ఏకరంన్నర స్థలం పూర్వ కాలం నుండి ఉన్నది.కాగా ప్రతిఏడాదీ పీర్ల పండుగ నిర్వహించడానికిగాను నాడు ముతవల్లిలకు వక్ఫ్‌బోర్డు ఆదాయ వనరుల కోసం కొన్నేండ్ల వరకు వారికి స్థలాలను లీజ్‌కు ఇవ్వడం ఇచ్చింది. కాగా ఆ స్థలంలో కేవలం పంటలు పండించి దాని పైన వచ్చే ఆదాయంతో పీర్ల పండుగను ప్రతి సంవత్సరం నిర్వహించాలని నిబంధనలు ఉన్నాయి. ఇదిగాక ఎట్టి పరిస్థితుల్లో స్థలం అమ్మకూడదని, అలా చేస్తే వక్ఫ్‌బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందనే నిబంధన పొందుపరిచింది.కాగా సూర్యాపేట పట్టణం విస్తరించడంతో పాటు భూముల ధరలు కూడా పెరిగాయి. ముతవల్లి డబ్బుల ఆశకు స్థలాన్ని కొద్దికొద్దిగా అమ్ముకుంటూ వస్తున్నాడు.ఒకసారి వక్ఫ్ అధికారులు ఈ ముతవల్లి బాగోతం తెలిసి సస్పెండ్ కూడా చేశారు.ఆ తర్వాత పొలిటికల్ ఇన్ఫ్యూలెన్స్ ఉపయోగించి తిరిగి మళ్ళీ ముతవల్లి పోస్టు తెచ్చుకున్నాడు.కాగా 1996-97 సంవత్సరం లో స్థలం కబ్జాపై పత్రికల్లో రావడం జరిగింది.అప్పుడు కొంత సమస్య సద్దుమణిగింది.ఆ తర్వాత కూడా కబ్జాలపై వరుసగా కథనాలు వచ్చాయి.ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లాగా మారడంతో భూమికి మరింత డిమాండ్ పెరిగింది.కాగా ప్రస్తుత స్థలంలో అరెకరం కూడా ఇక్కడ ఉన్నట్టు కనిపించని పరిస్థితి నెలకొంది.ఇదిలావుండగా స్థలం అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకుగాను ఇదే స్థలంలో నిరుపేద ముస్లిముల కోసం డబల్ బెడ్ రూమ్‌లు నిర్మించి ఇవ్వాలని మంత్రి జగదీశ్‌రెడ్డి గతంలో ఒక మంచి ఆలోచన చేశారు.వెంటనే శంకుస్థాపన ఏర్పాట్లు చేశారు.కానీ ముతవల్లి అక్కడికి వచ్చి ఈ స్థలం తన పేరునా లీజుకు ఉందని చెబుతూ ఆనాడు అతని కుటుంబసభ్యులతో ఆ స్థలంలో టెంట్‌వేసి నిరసనకు దిగాడు.దీంతో ఆనాడు రెవెన్యూ అధికారులు డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలకు బ్రేక్ వేశారు.ఇప్పుడు తాజాగా స్థలంలో మట్టి పోస్తున్నారు.పార్క్ నిర్మాణం కోసం మట్టి పోస్తున్నట్లు తెలిసింది.కాగా ఇక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేదని వక్ఫ్ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో ఎవరి అబ్బా సొత్తు అని వక్ఫ్ బోర్డు స్థలాన్ని అమ్మే, కొనుగోలు చేసే హక్కు ఎక్కడిదని ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి.వెంటనే వక్ఫ్,రెవెన్యూ అధికారులు స్పందించి ఇక్కడ ఉన్న ఎక్కరంన్నర స్థలం లెక్కలు తీయాలని కోరుతున్నారు.నక్ష ప్రకారం స్థలం మొత్తాన్ని పరిశీలించి హద్దులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు వారు సిద్ధపడుతున్నట్టు తెలిసింది.ఇదిలావుండగా అసెంబ్లీ సమావేశాలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ వక్ఫ్‌బోర్డు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని ఇట్టి స్థలాలను ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయవద్దని ఆ శాఖను ఆదేశించారు.ఇదిగాక వక్ఫ్స్థలాల్లో మైనార్టీ గురుకుల పాఠశాలలు నిర్మిస్తే స్థలాలు కబ్జా కాకుండా వాడుకలో ఉంటాయని వక్ఫ్ బోర్డుతో పాటు ప్రభుత్వం కూడా నిర్ణయించింది.ఇన్ని నిబంధనలు ఉన్నప్పటికీ స్థలాలను అమ్మడం మాత్రం ఆగడం లేదు.అదేవిధంగా కబ్జాలకు గురవుతుంది.మరి రెవెన్యూ వ్యవస్థ,వక్ఫ్‌బోర్డు శాఖ ఏం చేస్తున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది.ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి కబ్జాకు గురైనా స్థలంపై విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు.
బౌండరీ ఏర్పాటు చేయాలి
అస్రరర్ అహ్మద్ యుసిఫియా మజిద్ ముఫ్తి,ఖాజా ఇస్సార్రర్ అహమ్మద్ మైనార్టీ నాయకులు
స్థలం కబ్జా కాకుండా చుట్టూతా బౌండరీ ఏర్పాటు చేయాలి.జిల్లాకేంద్రంలో ఉన్న వక్ఫ్ భూములను పరిరక్షించాలి.కబ్జాదారుల నుండి స్థలాన్ని కాపాడాలి.
వక్ఫ్‌బోర్డు భూములు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలి
ఆవాజ్ కమిటీ జిల్లా కార్యదర్శి- షేక్ జహంగీర్
వక్ఫ్‌బోర్డుకు సంబంధించిన 1.30 ఎకరాల స్థలంలో మట్టి పోసి చదును చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న వక్ఫ్‌బోర్డు భూమిని పేద ముస్లిములకు అదే స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.
వక్ఫ్స్థలాన్ని పార్క్‌కు ఇవ్వలేదు
ఉమ్మడి నల్లగొండ జిల్లా వక్ఫ్ ఇన్స్పెక్టర్ మహమూద్, రెంట్ కలెక్టర్ జానీ
స్థలం మొత్తాన్ని సర్వే చేయించి స్థలం చుట్టూతా బౌండరి ఏర్పాటు చేస్తాం.రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు ఇక్కడ జరిగిన విషయం గురించి వారికి సమాచారం అందించాం.మున్సిపాలిటీకి పార్క్ నిర్మాణానికి స్థలం కేటాయించలేదు.వక్ఫ్‌బోర్డు సీఈఓ నుండి అనుమతి లేదు.ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన కఠిన చర్యలు తీసుకుంటాం.