Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు కిడ్నీలు ఫెయిల్ చికిత్స పొందుతున్న ఉమ
- ఇప్పటివరకూ 28 సార్లు డయాలసిస్
- అయినా మెరుగు కాని ఆరోగ్యం
- కిడ్నీ మార్పిడి చేస్తేనే ప్రాణం దక్కుతుందన్న వైద్యులు
- వైద్యానికి డబ్బులు లేక కుటుంబం సతమతం
- దాతలు ఆదుకోవాలని వేడుకోలు
నవతెలంగాణ -రామన్నపేట
రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది... ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడితో భార్యాభర్తలిద్దరూ కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలోనే భార్యకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆ గహిణి మంచానికే పరిమితమైంది. అప్పులు చేసి ఇప్పటివరకూ 28 సార్లు డయాలసిస్ చేయించినా ఆరోగ్యం కుదుట పడలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమె బతకాలంటే కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు తెగేసి చెబుతున్నారు. ఆర్థిక సహాయం కోసం దాతలను సహాయం చేయాలని సదరు కుటుంబం దీనంగా వేడుకుంటోంది. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన గట్టు ఉపేందర్, గట్టు ఉమ (31) ఇరువురు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కూతుళ్లు జ్యోతి (10), ప్రణతి (8), హిందు (6), ఒక కుమారుడు శ్రీనాథ్ (4) ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన భార్యాభర్తలిద్దరూ కూలీ నాలీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత ఆరునెలలుగా ఉమ ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడంతో డాక్టర్లకు చూపించగా పిడుగు లాంటి వార్త ఆ కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసింది. ఉమకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి, ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. వారానికి నాలుగుసార్లు డయాలసిస్ చేయాలంటే సుమారు 30 నుంచి 40 వేల రూపాయల ఖర్చు అవుతున్నది. ఇప్పటివరకు అప్పులు తెచ్చి 28 సార్లు డయాలసిస్ చేయించారు. అయినా ఉమ ఆరోగ్యం కుదుటపడకపోగా.. మరింత విషమంగా మారింది. ప్రస్తుతం ఆమెకు నార్కట్పల్లి కామినేని ఆస్పత్రిలో డయాలసిస్ చేయిస్తున్నారు. ఆమె బతకాలంటే కిడ్నీ మార్పిడి చేయక తప్పదని వైద్యులు చెబుతుండడంతో ఆర్థిక స్థోమత లేని ఆ నిరుపేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. తల్లికి ఏమైందో తెలియని పిల్లలు బోరున విలపిస్తున్నారు. కిడ్నీల మార్పిడికి దాతలు ఆర్థికంగా సహకరించాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.
ఫోన్ పే/గూగుల్ పే నంబరు 9848217066
బ్యాంకు అకౌంట్ వివరాలు
గట్టు ఉమా (పేషెంట్)
అకౌంట్ నంబరు : 62259515902
IFCS CODE: SBIN0020183. గాదె కష్ణ (ఉమ సోదరుడు) 7794963799.