Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19న సదస్సు , 20న మహాసభలు ప్రారంభం
- ముఖ్యఅతిధిగా కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
దేశం, రాష్ట్రం సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికి, మనిషిని మనిషిగా చూడలేని హీనమైన సంస్కృతి ఇంకా ఈ సమాజంలో వెళ్లూనుకొని ఉంది. కులవివక్ష యొక్క వికృతమైన రూపాలు నేటికి కొనసాగుతున్నాయి. మనువాద వ్యవస్థ, ఆధిపత్య దోరణి, భూస్వామ్య భావజాలం నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా ఏర్పడి మనుధర్మ శాస్త్రం ప్రకారం అణగారిన కులాలను అణిచివేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి వ్యవస్థను అంతం చేయడానికే కెవిపిఎస్ సంఘం ఏర్పడింది. మూడు ప్రధాన లక్ష్యాలతో సంఘం నిర్మాణం జరిగింది. జిల్లాలో జరిగిన అనేక కులంహకర హత్యలు, దాడులు తదితర వాటిపై అనేక పోరాటాలు నిర్వహించి దళితులను చైతన్యం చేసే ప్రక్రియలో క్రీయాశీలకంగా పనిచేస్తుంది. అదే కోణంలో పనిచేయడానికి భవిష్యత్ కార్యచరణే లక్ష్యంగా గతంలో చేసిన ఉద్యమాలు, భవిష్యత్ లక్ష్యాలను నిర్ధేశించుకోవడానికి కెవిపిఎస్ సంఘం జిల్లా మహాసభలను నేడు, రేపు నిర్వహిస్తున్నారు.
-- కెేవీపీఎస్ ఆవిర్భావం.. పోరాటం
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) 1998 సంవత్సరంలో ఏర్పడింది. అక్టోబర్ 2న ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యాలతో ఏర్పడింది. దాదాపు 14ఏళ్లుగా అనేక సామాజిక పోరాటాల్లో ప్రధాన భూమిక పోషించి దళితులు, గిరిజనులకు అండగా నిలిచింది. జిల్లాలో 21 మండలాలు, 261 గ్రామాలలో కెవిపిఎస్ నిర్మాణం జరిగింది. దళితులపై చిన్నజీయర్ స్వామి చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. దళితులను బూతు మాటలు తిట్టిన ఎమ్మేల్యే రాజాసింగ్ అట్రాసీటీ కేసు నమోదు చేయాలని ఆందోలన చేశారు. మాడ్గులపల్లిలో శ్రీకర్‌పై జరిగిన దాడి, బాలాపూర్‌లో దళిత గ్రామ కార్యదర్శిపై దాడి, అడవిదేవులపల్లిలో స్మశానవాటికలో దళితుడి శవాన్ని పూడ్చిపెట్టకుండా అడ్డుకున్న విషయంలో దళితులకు అండగా నిలబడడం జరిగింది. కేతేపల్లిలో ప్రీతీ హత్య కేసులో దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది.జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్‌లో ఉన్న అనేక సమస్యలపై ఆందోళనలు నిర్వహించింది. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 342 జీవో ప్రకారం 100యూనిట్స్ ఉచిత విద్యుత్‌కు ఉచితంగా ఇవ్వాలని ఉన్నా ఎక్కడ అమలు కావడంలేదని విద్యుత్ అధికారులకు విన్నవించడం జరిగింది. డబుల్బెడ్రూం ఇళ్లను దళితులకు ఇవ్వాలని అనేక ఆందోళనలు చేపట్టారు. ఇలా అనేక సామాజిక ఉద్యమాలు చేపట్టి , దళిత హక్కుల రక్షణ కోసం నిరంతరం కెవిపిఎస్ పనిచేస్తుంది. రాష్ట్రస్థాయిలో జరిగిన ప్రతి ఉద్యమంలో జిల్లా కమిటి పక్షాన అనేక కీలక భూమికి పోషించిన సందర్బం ఉంది.భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలు దళితులు, గిరిజనుల పక్షాన నిర్వహించేందుకు గత ఉద్యమాలు, అనుభవాలు, భవిష్యత్ పోరాట రూపాలను నిర్ణయించుకునేందుకు సంఘం సమాయాత్తమైంది.
రెండు రోజులు జిల్లా మహాసభలు
జూన్ 19, 20 తేదీలలో కేవీపీఎస్ జిల్లా మహాసభలు హాలియా మండల కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవన్( బొడిగపాక నాగరాజు నగర్)లో నిర్వహిస్తున్నారు. 19 సాయంత్రం 4గంటలకు సంఘం ఆధ్వర్యంలోనే దళితుల సంక్షేమం-- ప్రభుత్వాల పాత్ర సదస్సు నిర్వహిస్తున్నారు. ముఖ్యఅతిథులుగా చరిత్ర అద్యాపకులు లింగమూర్తి, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున హాజరు కానున్నారు.20న ఉదయం 10గంటలకు ప్రతినిధుల మహాసభ నిర్వహిస్తున్నారు. దాదాపు 250మంది ప్రతినిధులు హాజరయ్యే కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ హాజరుకానున్నారు. గత ఉద్యమాలు, భవిష్యత్ కార్యాచరణ ఈ మహాసభలో నిర్ణయం చేయనున్నారు.
-- దళితుల హక్కుల కోసం రక్షణకోసం పనిచేస్తాం
పాలడుగు నాగార్జున, కెేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
దళితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించింది. దాడులు, ఆత్యాచారాలు అనేకంగా పెరిగాయి. చట్టాలు పెద్దలకు చుట్టాలుగా మారాయి. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పేదలకు నష్టం కలిగిస్తుంది. అందుకే దళితుల పక్షాన మరింత ఉదృతంగా ఆందోళన చేయడానికి కార్యచరణ రూపొందిస్తాం.