Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
అసంక్రమిత వ్యాధుల నివారణ పై దృష్టి పెట్టాలని జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి కల్యాణ్ చక్రవర్తి అన్నారు.శనివారం నేరేడుచర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు.బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు క్రమం తప్పకుండా మందులు అందించాలన్నారు.వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని సిబ్బందిని కోరారు. గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు గ్రామాల నుంచి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వచ్చినప్పుడు ఉచితంగా వారికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ అనుమానిత వ్యాదిగ్రస్తులకు అన్ని ఆరోగ్య ఉపకేంద్రాలలో ఆరోగ్య కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రత్యేక పరీక్షలు నిర్వహిం చాలన్నారు. రొమ్ము,నోరు, గర్భాశయ ముఖద్వార పరీక్షలు 30 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి నిర్వహిస్తున్నట్టు తెలిపారు.అనుమానితులను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఎన్సీడీ క్లినిక్‌లలో నిపుణుల పర్యవేక్షణలో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బహిరంగప్రదేశాల్లో ధూమపానం చేసేవారికి కనీసం 200 రూపాయల జరిమానా విధించాలని, నేరేడుచర్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ , పోలీసు శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక తనిఖీ బందాలను ఏర్పాటు చేయాలని వారికి ధూమపానంపై అవగాహన కల్పించాలని సిబ్బందిని కోరారు.ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నాగయ్య, డాక్టర్ ధర్మతేజ, ఆరోగ్య పర్యవేక్షకులు శ్యాంసుందర్, స్టాఫ్‌నర్స్, ఆరోగ్య కార్యకర్తలు,ఆశావర్కర్స్ పాల్గొన్నారు.