Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ నక్సల్స్ జీవన విధానంపై ఆరా
- ఆధార్ కార్డు,బ్యాంక్ అకౌంట్ వివరాల సేకరణ
- మళ్లీ నక్సల్ మూమెంట్ వస్తుందా..?
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
జనత ప్రజాస్వామ్య విప్లవం కోసం అడవిబాట పట్టి మావోయిస్టు ఉద్యమంలో పనిచేసి లొంగిపోయిన నక్సల్స్ పై పోలీసులు ఈ మధ్య కాలంలో నిఘా మరింత బలోపేతం చేశారు. క్రమంగా నక్సల్స్ ఉద్యమం బలహీనపడుతూ వస్తుంది.అనారోగ్యంతో కొంతమంది మరికొంతమంది ప్రభుత్వం ప్రకటించి అందిస్తున్న సహకారానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు.ఉపాధి వెత్తుకొని జీవనం గడుపుతున్నారు. ఇక నక్సల్స్‌కు సహకరిస్తున్న సానుభూతిపరులపై సైతం పోలీసులు నజర్ వేసినట్లు సమాచారం. ముఖ్యంగా రాచకొండ ప్రాంతంలో నాడు మావోయిస్టు ఉద్యమం బలంగా ఉండేది. సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్, మునుగోడు మండలాల్లోని అనేక గ్రామాల్లో నక్సల్స్ కార్యకలాపాలు జరిగేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కొంత మూమెంట్ ఉన్న రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎలాంటి కార్యకలాపాలు నక్సల్స్ చేపట్టలేదు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నక్సల్స్ పై కఠినంగా వ్యవహరిస్తూ వస్తుంది.ఈ నేపధ్యంలో ఈ మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనశక్తి పార్టీ మాజీ నక్సల్స్ ,సానుభూతి పరులతో రహస్య సమావేశం ఏర్పాటు చేసినట్లు వచ్చిన వార్తల నేపధ్యంలో చౌటుప్పల్ ప్రాంతంలో పోలీసులు మాజీలపై నజర్ పెట్టారు.
చౌటుప్పల్ డివిజన్ లో 350 మందికి పైగా మాజీలపై నిఘా..?
చౌటుప్పల్ ప్రాంతంలో రాచకొండ దళంలో పనిచేసిన వారిపై, వారికి ఉన్న సానుభూతి పరులపై నిఘా పెంచినట్లు సమాచారం. చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం, దేవలమ్మనాగరం, పిపల్ పహాడ్, అల్లాపురం, ఆరెగూడెం, కాట్రేవ్, పంతంగి గ్రామాల్లో సుమారు 65 మంది, సంస్థాన్ నారాయణపురం మండలంలో నారాయణపురం, గుజ్జ, పుట్టపాక, కోతులపురం, సర్వేల్, మల్లారెడ్డిగూడెం తదితర గ్రామాల్లో సుమారు 120 మంది, మునుగోడు మండలం కోతులారం, మునుగోడు, పలివేల, సింగారం, కచలపురం గ్రామాల్లో సుమారు 85 మంది, వలిగొండ మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 145 మందికి పైగా అప్పుడు నక్సల్స్ గా పని చేసిన వారి జీవన విధానంపై పోలీసులు ఆరా తీశారు.మాజీ నక్సల్స్ గా ఉన్న వారిని ఆయా పోలీస్ స్టేషన్లకు రప్పించి పూర్తి వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఎం పని చేస్తున్నారు.ఉద్యోగం చేస్తే ఎక్కడ, ఎవరి వద్ద చేస్తున్నారు.ఆధార్ కార్డు,బ్యాంక్ అకౌంట్ వివరాలు పోలీసులు సేకరించారు.ఇక సానుభూతి పరులను కూడా పోలీస్ స్టేషన్ కు రప్పించి ఫొటోతో పాటు అన్ని వివరాలు సేకరించారు. అయితే పోలీసులు మాజీలను,సానుభూతి పరులను పోలీస్ స్టేషన్ కు రప్పించి వివరాలు సేకరించడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో పెద్దగా నక్సల్స్ కార్యకలాపాలు, రిక్రూట్మెంట్ కానీ లేదు.పోలీసులు తీసుకుంటున్న వివరాలతో మళ్ళీ నక్సల్స్ మూమెంట్ పుంజుకుంటు ఉన్నదా అనే అనుమానాలు ఉన్నాయి.అయితే పోలీసు అధికారులు మాత్రం మాజీలపై నిఘా ఎప్పటికి ఉంటుందని అంటున్నారు. అయితే మాజీలకు ప్రభుత్వం ఏదైనా సంక్షేమ కోసం కృషి చేస్తుందేమో అని చెప్తున్నారు.