Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్.
నవతెలంగాణ-సూర్యాపేట
మూసి కుడి ఎడమ కాలువల కింద గల పంట పొలాలకు వెంటనే నీటి విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో మూసి ఎడమ కాలువక్రింద గల రైతుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నందున వ్యవసాయ పనులు ప్రారంభించడానికి మూసి కాలువల ద్వారా నీటి విడుదల కోసం రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాల మూలంగా మూసి ప్రాజెక్టు లోకి వరద నీరు చేరి నిండిన్నందున వెంటనే రైతాంగానికి మూసి కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేయాలన్నారు. నీటి విడుదల తేదీలను ప్రకటిస్తే రైతులు నార్లు పోసుకునేందుకు సిద్ధం అవుతారని తెలిపారు.అలాగే మూసి ఆయకట్టు కింద ఉన్నటువంటి చెరువులు అన్నింటిని నింపాలని పేర్కొన్నారు. మూసి తూములకు షెట్టర్స్ ఏర్పాటు చేసి కాలువ చివరి భూములకు కూడా నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు.మూసి ఎడమ కాలువ కింద గల డి14 సబ్ కెనల్స్ 44, 98 రోడ్డు 33 ఫీట్లు ఉండాల్సి ఉండగా కొంతమంది ఆక్రమించుకొవడంతో కాలువ ఇరుకుగా మారి చివరి భూములకు నీళ్లు అందే పరిస్థితి లేదన్నారు.దీనిపై అధికారులు కాలువ ను పరిశీలించి విచారణ జరిపి కాలువ హద్దురాళ్లు పెట్టాలని పేర్కొన్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాలువను ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండా వెంకట రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి మందడి రామ్ రెడ్డి,రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొప్పుల రజిత,జిల్లా నాయకులు పందిరి సత్యనారాయణ రెడ్డి, నారాయణ వీరారెడ్డి,నాగిరెడ్డి శేఖర్ రెడ్డి, రెడ్డి మోహన్ రెడ్డి, నంద్యాల కేశవ రెడ్డి,పిండిగ జానయ్య,బొల్లా నాగేందర్ రెడ్డి, గట్టిపల్లి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.