Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
నాగార్జునసాగర్ ఎడమ కాలువపైన ఉన్న లిఫ్టులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు ప్రభుత్వం చేపట్టి లిఫ్టుల నిర్వహణ ప్రభుత్వమే చేయాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు,జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.సోమవారం తెలంగాణ రైతు సంఘం, ఎత్తిపోతల పథకాల రైతుసంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో స్థానిక జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు.నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమకాలువ ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాఆయకట్టుకు నీరందకపోవడంతో ఆ నష్టాన్ని భరించేందుకు ఎడమ కాలువలపైన ఎత్తిపోతల పథకాల ద్వారా అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరందించేందుకు ఏర్పాట్లు చేశారన్నారు.కొంతకాలం తరువాత లిఫ్టుల మోటార్ల జీవిత కాలం అయిపోయి పనిచేయక ఆగిపోవడం వల్ల కరెంటు సప్లై సరిగా లేకపోవడం వలన లిఫ్ట్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.ప్రత్యేక కరెంటు లైన్లు ఏర్పాటు చేసి నిరంతరాయంగా 24 గంటలు కరెంటు సప్లై ఇవ్వాలని, పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి ఆధునీకరించాలని డిమాండ్ చేశారు.లిఫ్టులను ఆధునీకరించి ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.వాటి నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించి, నిధులు కేటాయించి లిఫ్ట్ లను మరమ్మతులు చేయాలని పేర్కొన్నారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా నీటి పారుదల శాఖ కార్యాలయంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు పోతుగంటి వెంకటేశ్వరరావు, బాదే ధర్మయ్య ,బెల్లంకొండ సత్యనారాయణ,మద్దూరి మల్లారెడ్డి,నందిగామ సైదులు, రావులపెంట వెంకన్న,రేకల లింగయ్య, రావుల పెంట బ్రహ్మం,ఇంటూరి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.