Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ రాహుల్ శర్మ
నవ తెలంగాణ- నల్గొండ కలెక్టరేట్
త్యాగాలకు ప్రతీకైన బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో సామరస్యంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారంనాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, ముస్లీం మత పెద్దలు, శాంతి సంఘం సభ్యులతో పీస్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చే నెల బక్రీద్ పండుగ ఉన్నందున జిల్లాలోని మసీదులు, ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఈద్గాల వద్ద మంచినీరు, టెంట్లు, పారిశుద్ద్య చర్యలు, ఎలక్ట్రిసిటీ, తదితర మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. బక్రీదు పండుగ సందర్భంగా మున్సిపాలిటీ ప్రాంతాలలో మూడు రోజులపాటు పారిశుద్ద్య వ్యర్థాలు తొలగించడానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను కోరారు. కుల, మతాలు వేరైనా అందరూ స్నేహ భావంతో మెలగాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పండుగల విషయంలో అందరూ కలిసి మెలసి స్నేహితుల్లా ఉంటూ సహకరించుకోవాలని ఆయన కోరారు. పీస్ కమిటీ సమావేశానికి హజరైన వారు తమ సూచనలు, సలహాలు అందిజేసినందుకు జిల్లా యంత్రాంగం తరుఫున ఆయన కతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ, బక్రీదు పండుగకు పోలీసు శాఖ తరుఫున అన్ని బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలో డి.ఎస్.పి. ఆపై స్థాయి అధికారుల పర్యవేక్షణలో పండుగలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. పీస్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, కబరస్తాన్ల వద్ద విద్యుత్ లైట్లు, టెంట్లు, మంచినీరు, పారిశుద్ద్య చర్యలు నిర్వహించాలని కోరారు. ముస్లీం పేదలకు ప్రభుత్వము రేషన్ షాపుల ద్వారా అదనంగా బియ్యం, చక్కెర, పప్పులు, మొదలగు నిత్యావసర సరకులను ఉచితంగా అందజేయాలని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను అరికట్టాలని కోరారు. ఈ సమావేశంలో శాంతి సంఘం సభ్యులు హఫీజ్ ఖాన్, వీరెళ్లి చంద్రశేఖర్, నేతి రఘుపతి, సయ్యద్ హాషం, రఫీ, రజీయోద్దీన్, అహ్మద్ కలీం, నేల్లికంటి సత్యం, మత పెద్దలు అబ్దుల్ బషీర్, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ జమాల్ ఖాద్రి, మిర్యాలగూడ ఆర్డిఓ. రోహిత్ సింగ్, మున్సిపల్ కమీషనర్ డా. కె.వి రమణాచారి, నల్లగొండ డీఎస్పీ నర్సింహ్మ రెడ్డి, మిర్యాలగూడ, దేవరకొండ డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, పాల్గొన్నారు.