Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో మాత్రమే రైతులకు 24 గంటల ఉచిత కరెంటు
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఎందుకు సబ్సిడీ ఇవ్వడం లేదు?
- విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
- చౌటుప్పల్ లో 175 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ -చౌటుప్పల్ రూరల్
దేశంలోని మోడీ ప్రభుత్వం రైతుల నడ్డి విడిచే చర్యలు చేపడుతుంది. రైతు చట్టాలను తీసుకువచ్చి రైతులను కూలీలుగా మార్చే కుట్ర పన్నుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఎందుకు సబ్సిడీ ఇవ్వడం లేదని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో సింగిల్ విండో నిధులతో నిర్మిస్తున్న 175 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని రైతు సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. దేశంలో బిజెపి ప్రభుత్వం రైతులకు కనీసం కరెంటు ఇవ్వలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. బిజెపి ప్రభుత్వం రైతుల బాగోగులు పట్టించుకోకుండా దేశంలో మత చిచ్చులు పెట్టడానికి ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మోడీ సర్కార్ దేశంలో ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మివేసే పనిలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ను ప్రైవేటు పరం చేయాలని నూతన విద్యుత్ చట్టాలు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. దేశంలో రైతులు కరెంటు బిల్లులు కట్టడానికి ఉన్న ఇల్లులను అమ్ముకునే దుస్థితి నెలకొందని మండిపడ్డారు.
బీజేపీ మునుగోడు ప్రజలను కొనలేదు
మునుగోడులో జరిగే ఉప ఎన్నికల్లో బిజెపి నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులను కొంటుండొచ్చు కానీ మునుగోడు ప్రజలను కొనలేరని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి తన సొంత స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపీిలో చేరారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదని అన్నారు. మునుగోడు ప్రజలను కేసీఆర్ గుండెల్లో పెట్టి చూసుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీిఆర్‌ఎస్ జండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మెన్ చింతల దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ డీసీసీబీ చైర్మెన్‌్ గొంగిడి మహేందర్ రెడ్డి, వైస్ చైర్మెన్ ఏసి రెడ్డి దయాకర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మెన్ వెన్ రెడ్డి రాజు, చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మెన్ చెన్నగొని అంజయ్య, డైరెక్టర్లు బోరం నర్సిరెడ్డి, గుండెబోయిన రూపమ్మ, దుర్క కృష్ణ, పబ్బతి వెంకటయ్య, దొడ్డి శ్రీశైలం, బొడ్డు పద్మ ,సప్పిడి వెంకట్ రెడ్డి, బాతరాజు సాయిలు ,పానుగోతు సూర ,దౌడీ బాలరాజు, దుబ్బాక శశిధర్ రెడ్డి ,సీఈవో ఎరుకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రితో బీజేపీ డైరెక్టర్ వాగ్వాదం
గోదాం నిర్మాణ పనుల శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి బీజేపీి పాలన ఉద్దేశించి ప్రసంగిస్తుండగా సింగిల్ విండో డైరెక్టర్ బీజేపీి నాయకులు దుర్క కృష్ణ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని వారు అన్నారు. దీంతో మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశంలో రైతులు తలుచుకుంటే బీజేపీ నాయకుల గుడ్డలు ఊడుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి నిరోధకులుగా బిజెపి నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.