Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
- కల్లూరి మల్లేశం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు
- కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- సమ్మెలో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు
నవతెలంగాణ-చౌటుప్పల్రూరల్
ప్రతిష్ట ఇండిస్టీస్ యాజమాన్యం మొండి వైఖరి విడనాడి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం కోరారు. చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామ పరిధిలోని ప్రతిష్ట ఇండిస్టీస్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిష్ట ఇండిస్టీస్ యాజమాన్యం కార్మికులతో వేతన ఒప్పందం చేసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. గత రెండు సంవత్సరాల నుండి బోనస్ ఇవ్వడం లేదని తెలిపారు. దసరా పండుగ వస్తున్న నేపథ్యంలో కూడా ఆగస్టు నెల జీతం ఇప్పటికీ కార్మికులకు ఇవ్వలేదన్నారు. వేతన ఒప్పందం చేయాలని కార్మికులు అడిగితే పోలీసులతో బెదిరించుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రమాదకరమైన పనులు చేస్తున్న కూడా కార్మికులకు కనీస సేఫ్టీ కల్పించడం లేదని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు.
- కార్మికులకు మద్దతు తెలిపిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్
ప్రతిష్ట ఇండిస్టీస్ కంపెనీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ మద్దతు ప్రకటించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ ను వెంటనే పరిష్కరించాలని కోరారు.
- సమ్మెకు మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ నాయకులు
కార్మికులు చేపట్టిన సమ్మెకు టీిఆర్ఎస్ మండల నాయకులు మద్దతు ప్రకటించి కార్మికులతో బైఠాయించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఢిల్లీ మాధవరెడ్డి మాట్లాడుతూ కార్మికులు నిస్వార్ధంగా పనిచేస్తున్న కూడా కంపెనీ యజమాన్యం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వేతన ఒప్పందాలు చేసుకోకుండా కార్మికులు ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
అదేవిధంగా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద బిక్షం, జిల్లా ప్రధాన కార్యదర్శి బోలగాని జయరాములు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం డి పాషా, ప్రతిష్ట యూనియన్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశం, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, సింగిల్ విండో వైస్ చైర్మెన్ అంజయ్య, టిఆర్ఎస్ నాయకులు బొడిగె ఆనంద్, మాజీ ఎంపీటీసీ పిట్టల శంకరయ్య, భారతరాజు లింగస్వామి, మైలారం వెంకటేశం, సత్యం, డివియం, బిక్షపతి, లలిత తదితరులు పాల్గొన్నారు.