Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హక్కులను కాపాడుకునేందుకు సిద్ధం కావాలి
- డివిజన్ మహాసభలో టీడబ్ల్యూజేఎఫ్ వక్తలు
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అంటేనే సమస్యలపై పోరాటమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్కే. అయూబ్, ప్రధాన కార్యదర్శి బాదిని నర్సింహా, జాతీయ కౌన్సిల్ మెంబర్ గదె రమేష్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ భవనంలో నిర్వహించిన నల్లగొండ డివిజన్ మహా సభలకు ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాజీలేని పోరాటం నిర్వహిస్తుందన్నారు. మీడియా స్వేచ్ఛను, జర్నలిస్టుల హక్కులను కాపాడే పోరాటానికి జర్నలిస్టులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పట్టణాల్లో, మండలాలలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 20నుంచి 30ఏండ్లుగా జర్నలిజంలో పని చేస్తున్న జర్నలిస్టులు నేటికి ఇళ్ళస్థలాలకు నొచు కొలేదన్నారు. ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు కేటాయించాలన్నారు. విలేకరిగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులను అందజేయాలని పేర్కొన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు కార్పొరేట్ ఆస్పత్రిలలో చెల్లు బాటు అయ్యే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం 20.లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ జీవో విడుదల చేసిన జిల్లా కలెక్టర్కు, విద్యాశాఖ అధికారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ నల్లగొండ డివిజన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ జిల్లా కమిటీని శాలువాలతో ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వరునమ్మ, వివిధ పత్రికల జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.