Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
రాష్ట్రంలో షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్లో కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 26న నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి మొహీనుద్దీన్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్ పిలుపునిచ్చారు. శనివారం సీఐటీయూ. ఎఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం దొడ్డి కొమరయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్లో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాల జీవోలు సవరించాలని ఉన్నప్పటికీ ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాల జీవోలను సవరించకుండా కాలయాపన చేస్తుందన్నారు. కనీస వేతనాల చట్టం 1940 ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో 2005, 2012లో సవరణలు జరిగాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం 2016లో కనీస వేతనాల సలహా మండలి ఏర్పాటు చేసిందని, సలహా మండలి చేసిన సిఫారసులను అమలు చేస్తూ జీవోలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేటు యజమానులకు తొత్తులుగా ఉంటూ కార్మికులకు కనీస వేతనాలు అందకుండా చేస్తుందని ఆరోపించారు. కోటి 20 లక్షల మందికి ప్రయోజనం కలిగించే కనీస వేతనాల జీఓలను వెంటనే సవరించి కార్మికులకు ప్రయోజనం కలిగించాలని కోరుతూ కార్మిక సంఘాలన్నీ సెప్టెంబర్ 26న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. అందులో భాగంగా నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు జిల్లావ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల కార్మికులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో వివిధ సంఘాల నాయకులు దండంపల్లి సత్తయ్య, పాణ్యం వెంకట్రావు, సుంకిశాల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.