Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
విప్లవ పోరాట మార్గంలో పనిచేసే కమ్యూనిస్టు పార్టీలకు అమరవీరుల అమరత్వమే పోరాట మార్గానికి అమర జ్యోతి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అలగడప గ్రామంలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు గూడా అనంతరాములు 13వ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. అనంతరాములు ఈ ప్రాంతంలో సీపీఐ(ఎం) నిర్మాణానికి, పేద ప్రజల సమస్యల పరిష్కారానికి తాను జీవించినంత కాలం పని చేశారని, అయన మార్గంలో కుటుంబసభ్యులు కూడా నడవడం అభినందనీయమని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలో పనిచేసే నాయకులు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను అధ్యయనం చేసుకుంటూ గ్రామస్థాయి నుంచే ప్రజలను కదిలించి ఉద్యమాలు నిర్వహించాలని అయన పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మతోన్మాదాన్ని తిప్పి కొట్టాలంటే గ్రామస్థాయి నుంచి ప్రజలను సెక్యూలరిజం గొప్పతనాన్ని తెలియజేసి భారత రాజ్యాంగం పేర్కొన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే విధంగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బీకార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవినాయక్, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పతాని శీను, మండల అధ్యక్షులు గూడా నాగేంద్రప్రసాద్, గ్రామ శాఖ కార్యదర్శి పట్టేటి వెంకటయ్య, నాయకులు అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.