Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ శాసన సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-దామరచర్ల
ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడి ప్రభుత్వం పై వ్యవసాయ కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపు నిచ్చారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం దామరచర్ల మండల కేంద్రంలో శనివారం జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం 5 వ మండల మహసభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం వేసవి అలవెన్సులు రద్దు చేస్తూ సర్క్యులర్ 17022 (31) జారీ చేసి ఉపాధి హామీ పనుల హాజరు నమోదు కోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్.ఎం.ఎం.ఎస్) తెచ్చి జాతీయ గ్రామీణ ఉపాధి కూలీలను భయభ్రాంతులకు గురిచేస్తుందని చెప్పారు. ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడానికి అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తుందని ఆరోపించారు. అందులో భాగంగానే బడ్జెట్లో గత సంవత్సరం కేటాయించిన 98 వేలకోట్ల బడ్జెట్ను కుదించి కేవలం 73 వేలు కోట్లు మాత్రమే కేటాయించినట్లు చెప్పారు. ఏకంగా 25 వేల కోట్ల రూపాయలను తగ్గించిందన్నారు. భవిష్యత్తులో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో దాగి ఉందని విమర్శించారు. ఇప్పకైనా ఉపాధి హామీకి కనీసం లక్ష 64 వేల కోట్ల రూపాయలుకు పెంచాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలల నుండి పని చేసిన వారికి పెసిప్స్ ఇవ్వకపోవడం, ఐదారు నెలలుగా పెండింగ్ డబ్బులు ఇవ్వక పోవడంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో పనిచేస్తున్న కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణం పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక జాబ్ కార్డులు ఇద్దరు ముగ్గురు ఉండటంవల్ల సంవత్సరానికి ఒక్కరికి 20, 25 రోజుల పనిదినాలు మాత్రమే దొరుకుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వము సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించి, రోజు కూలీ ఎలాంటి కొలతలు లేకుండా 600 రూపాయలు ఇవ్వాలన్నారు. ఉపాధి పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. నీడ కోసం టెంటు,మెడీకల్ కిట్టు, మంచినీళ్లు ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని , జాబ్ కార్డులు లేని వారికి వెంటనే జాబ్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం రానున్న కాలంలో వ్యవసాయ కార్మికులు అందరూ కూడా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లాప్రదాన కార్యదర్శి.నారిఐలయ్య, సీఐటీయూ రాష్ట్ర నాయకులు డబ్ఫికార్ మల్లేశం, రైతు సంఘ జిల్లా అధ్యక్షులు వి. వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి మాలోతు వినోద్, సీనియర్ నాయకులు పాపా నాయక్, దయానంద్, కాజా మొహిదీన్, బాల సైదులు, జటంగి సైదులు, తదితరులు పాల్గొన్నారు.