Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేములపల్లి
పాలకుల, అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారింది. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన వారి పైర్లు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోక వెళ్తే మండలంలోని వేములపల్లి, తిమ్మారెడ్డిగూడెం, శెట్టిపాలెం, మొల్కపట్నం, సల్కునూరు, రావులపెంట గ్రామాలలో ఎత్తిపోతల కింద సాగుచేసిన వరి పంటలు నీరు లేక సుమారు 100 నుండి 150 ఎకరాలు ఎండిపోయాయి. ఇటీవల సాగర్ కల్వకు గండిపడడంతో నీటిని నిలిపి వేశారు. దీనికి తోడు ఎత్తిపోతల పథకాలు అస్తవ్యస్తంగా ఉండడంతో మోటర్లు నడవక నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు పదివేల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టాం అన్నారు. ఎత్తిపోతలను నిర్వహించేందుకు ఆపరేటర్లుగాని, అధికారుల పర్యవేక్షణగాని లేదన్నారు. ఎత్తిపోతల పథకాల మోటర్లు కాలిపోయాయని, మరమ్మత్తులు చేసేవారు లేక వధాగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు ఎత్తిపోతల పథకాలను మరమ్మత్తులు చేసి నీటిని అందించాలని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
ఏడెకరాల వరి పంట ఎండిపోయింది
-కొమ్మనబోయిన సైదులు (సల్కనూరు)
ఎత్తిపోతల పథకం కింద 7 ఎకరాల వరి పంటను వేశాను. కాలువ బందు కావడం, లిఫ్టు నడవకపోవడం వల్ల పంట మొత్తం ఎండిపోయింది. సుమారు లక్ష రూపాయలు వరకు నష్టపోయాను లిఫ్ట్ మరమ్మతులు చేసి నీరు అందిస్తే బయటపడతాం.