Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగో రోజుకు చేరిన ప్రతిష్ట కార్మికుల సమ్మె
- వంటావార్పుతో నిరసన తెలిపిన కార్మికులు
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
కార్మికులు చిందించిన చెమట చుక్కలతో ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు.సంపదను సృష్టిస్తున్న కార్మికులకు మాత్రం వేతనాలు ఇవ్వడానికి మొండి వైఖరి ప్రదర్శించడం తగదని సీఐటీయూ జిల్లా కోశాధికారి దోనూరి నర్సిరెడ్డి అన్నారు.చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామ పరిధిలోని ప్రతిష్ట ఇండిస్టీస్ ఎంప్లాయీస్ అండ్ కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది.కార్మికులకు సీఐటీయూ నుండి మద్దతు తెలిపారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పెట్టుబడిదారులు కార్మికవర్గాన్ని దోపిడీకి గురిచేస్తూ తన సంపదను పోగుకోవడానికి ప్రయత్నించడం సహజమ న్నారు.కార్మికులు తనశక్తిని ఉపయోగించి సష్టించిన సంపదతో మేడలు కట్టుకుంటున్న ప్రతిష్ట ఇండిస్టీస్ యజమాన్యం కనీసం కార్మికులకు సౌకర్యాలు కల్పించకపోవడం దారుణ మన్నారు.ప్రతిష్ట ఇండిస్టీస్ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని తెలిపారు. రెండేండ్లుగా వేతనఒప్పందం చేసుకోకుండా కంపెనీ యాజమాన్యం ప్రవర్తించడం అభ్యంతరకరమన్నారు.కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ, కార్మికులను ఇబ్బందులుపెడుతున్న ప్రతిష్ట ఇండిస్టీస్ యజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.కార్మికుల కోరికలు న్యాయబద్ధమైనవని అన్నారు. ప్రతిష్ట ఇండిస్టీస్ యాజమాన్యం 12 గంటలకు పని చేయించుకుంటూ కనీసవేతనం ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు.కంపెనీలో సుమారు 300 మంది పైగా కార్మికుల పని చేస్తుంటే క్యాంటీన్ సౌకర్యం కూడా లేదని తెలిపారు.అదేవిధంగా వెల్లంకి గ్రామసర్పంచ్ ఎడ్ల సత్తిరెడ్డి కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు.మహిళా కార్మికులు బతుకమ్మలతో సమ్మెను కొనసాగించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరిమల్లేశం, జిల్లా కార్యదర్శి ఎండి పాషా, ప్రతిష్ట యూనియన్ ప్రధానకార్యదర్శి గడ్డం వెంకటేశం,జీఎంపీఎస్ మండలకార్యదర్శి కొండే శ్రీశైలం, నాయకులు లలిత, డీవీఎం,భిక్షపతి,వెంకటేశ్, సత్యం పాల్గొన్నారు.