Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపాలిటీలో రూ.500 కోట్ల లేఅవుట్ స్థలాలు మాయం
- తొమ్మిది నెలలుగా నిర్వహించని మున్సిపల్ సమావేశం
- 30న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
హుజూర్నగర్ మున్సిపాలిటీ పూర్తిగా హద్దులు దాటి అవినీతిమయంగా మారిందని,స్థానిక టీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీ నిధులను,లే అవుట్ భూములను కాజేస్తున్నారని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై ముఖ్యమంత్రి,పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌కు లేఖ రాస్తానన్నారు.మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ప్రమేయంతోనే అవినీతి జరుగుతోందని ఆరోపించారు.తొమ్మిది నెలల నుండి మున్సిపాలిటీ సమావేశం నిర్వహించకుండా ముందస్తు అనుమతుల పేరుతో రూ.2 కోట్లు స్వాహా చేశారన్నారు.ప్రతినెలా కౌన్సిల్ సమావేశం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ 9 నెలల నుండి మున్సిపల్ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.మున్సిపల్ కమిషనర్ ఎమ్మెల్యేకు కీలుబొమ్మగా మారి వందల కోట్ల అవినీతికి తెర లేపారన్నారు.మున్సిపాలిటీలో లే అవుట్ డాక్యుమెంట్లు,కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసిన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వం,ప్రైవేటు భూములకు రక్షణ లేకుండా పోయిందని, ఈ భూములను కాపాడాల్సిన భాధ్యత హుజూర్నగర్ ప్రజలకు ఉందని గుర్తు చేశారు.ప్రతి ఒక్కరూ పోరాటం చేయడానికి కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.హుజూర్‌నగర్‌లోని సాయిబాబా టాకీస్రోడ్ లో గల మున్సిపాలిటీ లేఅవుట్ స్థలం 5,500 గజాలలో రూ.75 లక్షల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు కోసం నేటి మంత్రి జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారని, తిరిగి స్థలాన్ని మార్చి ఎన్ఎస్వీ క్యాంపులో కోర్టులో ఉన్న స్థలంలో రూ.7.50 కోట్లతో తిరిగి ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారని ఆరోపించారు.రూ.75 లక్షల అంచనా వేసిన మార్కెట్పనులను.రూ. 7.50 కోట్లు ఎట్లా అయ్యిందని,కమీషన్ల కోసమే ఆ మార్కెట్ నిర్మాణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.కమిషనర్ సంతకం, ఏఈ, ఆర్ఐల లాగిన్లు దొంగతనం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.మున్సిపాల్టీలో పూర్తి స్థాయిలో అధికారులు లేరని ఇక్కడ పని చేయడానికి అధికారులు ఎవరు రావడం లేదని గుర్తు చేశారు.హుజూర్నగర్ మున్సిపాలిటీ లో 40 ఎకరాలలో లేఅవుట్లు లేకుండా అక్రమంగా వెంచర్లు చేసి అమ్మకాలు చేస్తున్నా కమిషనర్ ఎందుకు స్పందించడం లేదన్నారు.హుజూర్నగర్ తహసీల్దార్ గుంటలలో ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ సమావేశం నిర్వహించాలని,జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, కౌన్సిలర్లతో ధర్నా చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్‌రావు, సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్‌కుమార్, కౌన్సిలర్స్ కోతి సంపత్‌రెడ్డి,రాజానాయక్,కె.విజయ వెంకటేశ్వర్లు,వేములవరలక్ష్మి నాగరాజు, వేములవెంకన్న, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు కుక్కడపు మహేష్‌గౌడ్, ముక్కంటి,బంటు సైదులుగౌడ్, ముశం సత్యనారాయణ పాల్గొన్నారు.