Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. సాగర్
నవతెలంగాణ-సూర్యాపేట
మద్దతు ధరల చట్టం, కొనుగోలు గ్యారంటీ కోసం రైతాంగం ఉద్యమించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలు,రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలకు రైతాంగం సిద్ధం కావాలని కోరారు.బీజేపీ పాలనలో రైతుల పరిస్థితి మరింత దిగజారిపోయిందని, పూర్తిగా నష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద, కార్పొరేటీకరణ విధానాలే ఈ దుస్థితికి కారణమన్నారు.సంక్షోభం నుంచి రైతన్నలు బయట పడాలంటే కేంద్రం కనీసమద్దతు ధర పెంచి, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సమగ్రపంటల బీమాను అమలుచేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.కార్పొరేట్లు, భూస్వాములకే బ్యాంకులు విరివిగా రుణాలు ఇస్తున్నాయని తెలిపారు.ప్రతి రైతుకూ బ్యాంకులు సున్నా శాతం వడ్డీకి లోన్లు ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేయాలన్నారు.బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశమంతా విస్తరించాలని భావిస్తోందన్నారు.ఇప్పటికే తెలంగాణ మున్సిపల్ సీట్లలో తిష్టవేసిందని తెలిపారు.దేశంలో ప్రతి పౌరునికి సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానతలు రావాలంటే బీజేపీ పోవాలన్నారు.దీనికోసం రైతాంగం ఉద్యమించాలని కోరారు.ఉదారవాద, నయా సరళీకరణ ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన నాటి నుంచి దేశ వ్యవసాయ రంగంలో సంక్షోభ పరిస్థితులు తీవ్రమౌతువూ వచ్చాయని పేర్కొన్నారు.1997 నుంచి 2014 వరకు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.కేంద్రంలోని బీజేపీ ఏడేండ్ల పాలనలో లక్ష మంది పైగా రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు.తెలంగాణలో రోజూ ఏదో ఒకచోట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.కార్పొరేట్లకు వ్యవసాయాన్ని కట్టబెట్టి, రైతులను బానిసలుగా మార్చడమే బీజేపీ లక్ష్యమని విమర్శించారు. రైతాంగం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మద్దతుధర ఇవ్వాలని, ప్రతిపంటకూ గిట్టుబాట ధర కల్పించాలని కేంద్రంపై రైతాంగం తిరగబడటం ఒక్కటే మార్గం అని అన్నారు.ఈ సమావేశంలో తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకట్‌రెడ్డి,రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొప్పుల రజిత, జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కందాల శంకర్ రెడ్డి, దేవరంవెంకటరెడ్డి, షేక్‌సైదా, మందడి రాంరెడ్డి, పందిరిసత్యనారాయణరెడ్డి, గుమ్మడవెల్లి ఉప్పలయ్య, పల్లె వెంకట్‌రెడ్డి, పల్లా సుదర్శన్, బెల్లంకొండ సత్యనారాయణ, నాగిరెడ్డి శేఖర్‌రెడ్డి, దండా శ్రీనివాస్‌రెడ్డి, దుర్గి బ్రహ్మం, రెడ్డి మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.