Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులందరికీ పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా ఇచ్చిన జీవో 60 ప్రకారం 19 వేల వేతనం పెంచాలని, కార్మికులకు గుదిబండగా మారిన మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామపంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) మర్రిగూడ మండల 5వ మహాసభ ఆదివారం వట్టిపల్లి హనుమంతు అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు పారిశుద్ధ్యం నర్సరీ, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పన్నుల వసూలు, ఆఫీస్ నిర్వహణ తదితర కేటగిరీలలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని వీరి పట్ల మాత్రం ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె ప్రగతి డంపింగ్ యార్డ్ తదితర కార్యక్రమాల్లో జిపి కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మల్టీ పర్పస్ విధానం తీసుకొచ్చి సెలవులు పని గంటలతో నిమిత్తం లేకుండా బానిసలుగా పని చేయిస్తూ వేతనాలు పెంచకుండా ఉద్యోగ భద్రత లేకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వేతనాల పెంపు ప్రకటన చేయకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ ఏర్పుల యాదయ్య, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వట్టిపల్లి హనుమంతు, ఊరుపక్క లింగయ్య, యూనియన్ నాయకులు భీమనపల్లి ముత్తయ్య, తిప్పర్తి లింగయ్య, పెరుమాళ్ళ అమ్రాబాద్ సునీత, నక్క నరసింహ, ఊరిపక్క వెంకటయ్య, బడే లక్ష్మీకాంత్, పోలేపల్లి రాము, బుష్పాక నరసింహ, నారమళ్ళ సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.