Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం
- మాజీ ప్రభుత్వ విప్ కర్నే ప్రభాకర్
- ఎస్ లింగోటం గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ
నవతెలంగాణ -చౌటుప్పల్ రూరల్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక ఉద్యమం కొనసాగిందని మాజీ ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. సోమవారం మండలం ఎస్ లింగోటం గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ విగ్రహా ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. నాడు నైజాం కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చాకలి ఐలమ్మ ధైర్య సాహసాలు ప్రదర్శించిందన్నారు. చాకలి ఐలమ్మ కులం కోసం, మతం కోసం పోరాటాలు చేయలేదని స్పష్టం చేశారు. నాడు తెలంగాణలో జరుగుతున్న రజాకారులకు వ్యతిరేకంగా భూమి భుక్తి కోసం జరిగిన పోరాటంలో దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిందని గుర్తు చేశారు. నాటి సాయిధ రైతాంగ పోరాటంలో కుల మతాలకు అతీతంగా ప్రజలు ఉద్యమించారన్నారు. కానీ నేటి సమాజంలో పోరాటాలు, పదవులు పెద్దలకు మాత్రమే అన్నట్లు సమాజం తయారైందని తెలిపారు. చాకలి ఐలమ్మను ఓకే కులానికి ఆపాదించడం సరైన పద్ధతి కాదన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ సమాజంలో అంతరాలు లేని వ్యవస్థ కోసం నాడు చాకలి ఐలమ్మ పోరాడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మహిళలు, యువత పని చేయాలన్నారు. పెత్తందారీ ఆధిపత్యం పై తిరగబడి మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిందని కొనియాడారు. చాకలి ఐలమ్మ ప్రతిష్ట ప్రపంచ చరిత్రలో నిలిచిందన్నారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జరిగిన సాయిధరైతంగా పోరాటంలో దొరలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ పోరాటం చేసిందన్నారు.మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ప్రజల గుండెల్లో ఉండేలా పనిచేయాలన్నారు. చాకలి ఐలమ్మ తన కుటుంబం కోసమే కాకుండా ఆనాడు రజాకారుల అరాచకాలపై యావత్తు తెలంగాణ కోసం పోరాటం చేసిందన్నారు. ఎస్ లింగోటం గ్రామ సర్పంచ్ ఆకుల సునీత శ్రీకాంత్ చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, బీసీ సంఘం జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్, వివిధ పార్టీ నాయకులు గొంగిడి మనోహర్ రెడ్డి, చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, చౌటుప్పల్ వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, టిఆర్ఎస్ నాయకులు ఉప్పు కృష్ణ, ఢిల్లీ మాధవరెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ గంగాపురం గంగాధర్, రజక సంఘం నాయకులు భారతరాజు ధనంజయ, బాతురాజు యాదయ్య, బాతరాజు లింగస్వామి, సామకూరి యాదయ్య, రావుల స్వామి, బాతరాజు సత్యం, సింగిల్ విండో వైస్ చైర్మన్ అంజయ్య, ప్రజానాట్యమండలి కళాకారులు జగన్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు కొండూరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.