Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
- ప్రజావాణిలో 22 ఫిర్యాదులు స్వీకరణ
నవతెలంగాణ -భువనగిరి రూరల్
వీరనారి చాకలి ఐలమ్మ జీవితం అందరికీ స్ఫూర్తి అని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 127 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై, మాట్లాడారు. వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం, జీవితం అందరికీ స్ఫూర్తివంతమని అన్నారు. జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి వీరనారి చాకలి ఐలమ్మ జీవితం గురించి వివరించారు. వెనుకబడిన కుటుంబంలో జన్మించి, అనాటి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, అస్తిత్వం కోసం పోరాటం చేశారని, పంటను కోసి ఇంటికి తెచ్చిన ధీశాలి అని, అంతే కాకుండా వెట్టి చాకిరి నిర్మూలన కోసం పోరాడారని, చదువు, ధనం లేకున్నా నిలిచి పోరాడవచ్చు అని వారి జీవితం తెలియచేస్తుందని అన్నారు. బి.సి. సంఘాల ప్రతినిథులు వీరనారి చాకలి ఐలమ్మ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, హక్కుల కోసం పోరాడారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టరు విజయకుమారి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి యాదయ్య, జిల్లా ఎస్.సి. కార్పోరేషన్ ఇ.డి. శ్యాంసుందర్, జిల్లా మహిళా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి, జిల్లా పశు సంక్షేమ అధికారి కృష్ణ, జిల్లా మైన్స్ అధికారి, కలెక్టరేటు పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరా చారి, జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు రావుల రాజు, జిల్లా బిసి హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి ఏశాల అశోక్, బిసి సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో 22 ఫిర్యాదులు స్వీకరణ
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 22 ఫిర్యాదులను కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుండి స్వీకరించారు. అందులో రెవిన్యూ శాఖ 9, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ 8, భువనగిరి మున్సిపాలిటీ 2, జిల్లా వ్యవసాయ శాఖ 1, జిల్లా ఉపాధి కల్పన శాఖ 2 ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు దీపక్ తివారీ, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ కలెక్టరు విజయకుమారి, కలెక్టరేటు పరిపాలన అధికారి నాగేశ్వరరావు చారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.