Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
రాష్ట్రంలో షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్‌లో కనీస వేతనాల జీవోలను సవరించి కనీస వేతనం 26,000 ఉండేవిధంగా నిర్ణయించి అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా నాయకులు కే. నరసింహారెడ్డి, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్‌లు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్‌లో కనీస వేతనాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సి ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం సవరణలు జరగలేదన్నారు. వివిధ రంగాలలో పనిచేసే కార్మికుల కనీస వేతనాలు పెరగలేదని, పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు ఇంటి అద్దెలు, విద్యా వైద్య ఖర్చులు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ లో కనీస వేతనాలు సవరించాలని డిమాండ్ చేశారు. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన వాటికి గెజిట్ ఇవ్వాలని కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు విజ్ఞప్తి చేసిన పెడచెవినపెడుతుందని ఆరోపించారు. తక్షణమే కనీస వేతనాల జీవోలు సవరించి 15వ ఐ ఎల్ సి తీర్మానం , డాక్టర్ ఆత్రాయుడు ఫార్ములా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా కనీస వేతనాలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, సీఐటీయూ,ఎఐటియుసి, ఐఎన్టియుసి ఐఎఫ్టియు వివిధ రాష్ట్ర, కేంద్ర కార్మిక సంఘాల నాయకులు, డబ్బికారు మల్లేష్, ఎండి సలీం, దొనకొండ వెంకటేశ్వర్లు, అవుత సైదులు, దండెంపల్లి సత్తయ్య, నారబోయిన శ్రీనివాస్, నల్ల వెంకటయ్య,లెనిన్ బాబు, తిరుపతి రామ్మూర్తి, రొండి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.