Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ
నవతెలంగాణ-చండూర్
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు అక్టోబర్ 19 వ తేదీన యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది గీత కార్మికులతో సింహ గర్జన బహిరంగ సభ నిర్వహించి, లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో సింహ గర్జన చేస్తామని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వి.రమణ అన్నారు. సోమవారం స్థానిక శీల అనసూయ గార్డెన్స్‌లో తెలంగాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలు కొండ వెంకన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలైన గీత కార్మికులందరికీ కుటుంబానికి రూ.10 లక్షల గీతన్నబందు పేరుతో ఇవ్వాలని, సభ్యులైన గీత కార్మికులందరికీ బైకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని, వీరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రూ.5000 కోట్ల బడ్జెట్ కేటాయించి సొసైటీకి ఐదు ఎకరాల భూమి, కల్లుకు మార్కెట్, నీరా తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పాలని అన్నారు. పెన్షన్ 5వేలకు, ఎక్స్ గ్రేషియా 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో రాజకీయాలలో రాణించాలన్నారు. జిల్లా కార్యదర్శి చౌగాని సీతారాములు గత మూడు సంవత్సరాల నుంచి కల్లుగీత కార్మిక సంఘం జిల్లాలో చేసిన కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టగా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు సుధాకర్, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సురుగు రాజేష్, జిల్లా గౌరవ అధ్యక్షులు పామనుగుండ్ల అచ్చలు గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శిలు రాచకొండ వెంకట్ గౌడ్, జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులుగా వేములకొండ పుల్లయ్య, కొప్పుల అంజయ్య, బొడ్డుపల్లి లక్ష్మి, ఉప్పల గోపాల్, తదితరులు పాల్గొన్నారు.