Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-24 గంటల విద్యుత్ సరఫరా చేయాలనీ ధర్నా
నవతెలంగాణ-నిడమనూరు
రైతాంగాన్ని 24 గంటల కరెంట్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్రెడ్డి నాగిరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కార్యాలయం ముందు తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తామని గొప్పలు చెప్పడం తప్ప ఎక్కడ ఇచ్చింది లేదన్నారు. ఎన్ఎస్పీ ఎడమ కాలువకు గండి పడి ఓ పక్క రైతులు తీవ్రంగా నష్ట పోతే, మరోపక్క కరెంట్ సక్రమంగా అందక బోర్ల కింద పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తరచూ విద్యుత్ కోతల వల్ల మోటార్లు కాలిపోతున్నాయని, విద్యుత్ లేక పొలాలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రాజెక్టులు పూర్తిగా నిండి ఉన్న విద్యుత్ పుష్కలంగా ఉత్పత్తి అవుతున్నప్పటికీ రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని అన్నారు. నిరంతరాయంగా వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వాలని, విద్యుత్ కోతలు అరికట్టాలని కోరారు. అనతరం మండల విద్యుత్ ఏఈ వెంకటేశ్వర్లుకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కేవీపీస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు పల్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి, నల్లబోతు సోమయ్య, కోమండ్ల గురువయ్య, కోతి ఇంద్రారెడ్డి , జక్కలి శ్రీనివాస్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.