Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దిగుబడి అంచనా 30లక్షలకుపైగా మెట్రిక్ టన్నులు
- 17లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి సాగుకు అత్యంత ప్రధానమైన జిల్లా . ప్రతిసారి పంట దిగుబడి అంచనాను వేయడంలో అధికారులు ముందంజలో ఉంటారు. కానీ ఆ పంటను కొనుగోలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటారనేది బహిరంగ రహస్యమే. పంట కళ్లాలకు వచ్చి రోజులు గడుస్తున్న కొనుగోలు చేయరూ... చేసిన గన్నీ బ్యాగులుండవూ.. కొనుగోలు చేసిన తర్వాత వాటిని తరలించడానికి లారీలు సమయానికి రావు... ఇలా చెపుకుంటూ పోతే ప్రతిసారి రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. గతాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న ఖరీఫ్ సీజన్ దాన్యం దిగుబడికి అనుకూలంగా కొనుగోలుకు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు 12.57లక్షల ఎకరాలలో వరి పంట సాగైంది. వాటిల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో 3లక్షల ఎకరాలు, నల్లగొండ 4.90లక్షల ఎకరాలు, సూర్యపేట 4.67లక్షల ఎకరాలలో పంటలను సాగు చేశారు. ఈ పంటకు ధాన్యం దిగుబడి ఎంత వరకు రానుందనే అంచనాను అధికారులు వేశారు. ఆ అంచనా ప్రకారమే ఉమ్మడి జిల్లాలో సుమారు 30లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని పెర్కొంటున్నారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో 6.58లక్షల మెట్రిక్ టన్నులు, నల్లగొండ 11లక్షల మెట్రిక్ టన్నులు, సూర్యపేట జిల్లాలో 11.89లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని తెలుస్తుంది.
అక్టోబర్ రెండవారంలో వరి కోతలు ప్రారంభం...
ప్రతి సీజన్లోనూ వరి కోతలకు సంబందించి దిగుబడి అంచనాను నెల రోజుల ముందే వేస్తుంటారు. అందులో భాగంగానే జిల్లాలో అధికారులు ఈ సీజన్లో వచ్చే దాన్యం దిగుబడిని ఇప్పటికే అంచనా వేశారు. ఖరీఫ్ సీజన్ వరి వచ్చే అక్టోబర్ రెండవ వారంలోనే కోతలు మొదలయ్యే అవకాశం ఉంది. బోరుబావుల కొంద ఉన్న వరి సాగుకు సంబంధించిన పంట దిగుబడి తొందరలోనే అవకాశం ఉంది. సాగర్ ఆయకట్టు కింద పంట దిగుబడి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఏటా సీజన్ మొదలైన తర్వాత ఆలస్యంగానే నీటి విడుదల చేస్తారు. దానిని బట్టి వరి కోతలు అక్కడ మొదలు పెడతారని తెలుస్తుంది. మొత్తంగా నవంబర్ నాటికి వరి కోతలు, కొనుగోలు పూర్తి కానున్నాయి.
యాదాద్రిలో కేంద్రాల ఏర్పాటు ఓ కొలిక్కి....?
మూడు జిల్లాలో పంట కోతలు ప్రారంభమయ్యే నాటికి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చర్యలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ జిల్లాలో ఎన్ని కేంద్రాలు, వాటికి అవసరమైన పరికరాలు, సిబ్బంది తదితర వాటిని నిర్ణయిస్తారు. అయితే వచ్చే నెల మొదటి వారంలోనే కొతలు మొదలయ్యే అవకాశమున్నందున ఇప్పటికే కేంద్రాల ఏర్పాటుపై చర్యలు ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు యాదాద్రి జిల్లాలోనే 286 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని, అందులో 85ఐకెేపీి, 197 పీఏసీిఎస్, మార్కెటింగ్‌శాఖ 4 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారని తెలుస్తుంది. కానీ సూర్యపేట నల్లగొండ జిల్లాలో గతేడాది సీజన్లో సుమారు 200కేంద్రాల వరకు నిర్వహించారు. అయితే ఈసారి ఆలాంటి ప్రతిపాదనలు మొదలు కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 17లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వరకు మార్కెట్లలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పెర్కొంటున్నారు. గత సీజన్లో వరి ధాన్యం కేంద్రాలకు వచ్చినప్పటికి కొనుగోళ్లు మొదలు కాకపోవడంతో రైతులు రోజుల తరబడి ధాన్యం రాసుల వద్ద పడిగాపులు కాసేవారు. ఒక్కొక్కసారి వర్షం దాటికి ధాన్యం వరదల్లో కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఈసారి ముందస్తుగానే కేంద్రాల ఏర్పాటు ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదు.
ధాన్యం వచ్చే వరకు కేంద్రాలు సిద్దంగా ఉండాలి..
-- బండ శ్రీశైలం, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
వరి కోతలు వచ్చే నెల రెండవ వారంలో మొదలయ్యే అవకాశం ఉన్నందున ధాన్యం కేంద్రాలకు చేరే వరకు కేంద్రాలను ప్రారంభించాలి. అలా గాకుండా వచ్చిన తర్వాత చేస్తామంటే ప్రకృతి పరమైన నష్టం జరిగితే దానికి రైతులు తీవ్రంగా నష్టపోతారు. అందుకే ధాన్యం వచ్చే వరకు కేంద్రాలు ఏర్పాటై కొనుగోలు సిద్దంగా ఉండాలి.