Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందించే కార్మికుల సమస్యలపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపాలని సీఐటీయూ శ్రామిక మహిళా జిల్లా కార్యదర్శి చెరుకు ఏకలక్ష్మీ డిమాండ్ చేశారు.ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యాశాఖ అధికారులు వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపే దిశగా ప్రయత్నాలు కొనసాగించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్నభోజన కార్మికులతో కలిసి మంగళవారం జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం డీఈఓ అశోక్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సంధర్భంగా ఏకలక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 25వేల పాఠశాలల్లో సుమారు 54 వేల 201 మంది మధ్యాహ్న భోజనకార్మికులు 24 లక్షల మందికి భోజనం వండి పెడుతున్నారన్నారు.కార్మికులకు పాత మెనూ ప్రకారమే చార్జీలు అందజేయడంతో కార్మికులకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నూతన మెనూను రూపొందించి చార్జీలు అందించాలని కోరారు.మార్కెట్లో ఒకగుడ్డు ధర రూ.6 ఉంటే ప్రభుత్వం కేవలం రెండు రూపాయలు అందించేలా బడ్జెట్లో కేటాయించడం సబబు కాదన్నారు.సమస్యలపై ఫెడరేషన్ 2వ జాతీయ మహాసభలను నవంబర్4,5వ తేదీల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. మహాసభలకు కార్మికులు, మేధావులు,ప్రజా సంఘాల నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కనుకుంట్ల ఉప్పమ్మ, సైదమ్మ, దుర్గ, దేవకమ్మ, సుజాత, భద్రమ్మ, మంగ, రమాదేవి, అనిత,ఎల్లమ్మ,తదితరులు పాల్గొన్నారు.