Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
విద్యుత్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పరిధి నుండి స్వాధీనం చేసుకొని అదాని, అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు,కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీ.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అఖిల భారత రైతు, కూలీ సంఘం.(ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం డీఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్తు అనేది నిత్యవసరమైందన్నారు. ఇది గత కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్నదని, 1990లో నూతన ఆర్థిక విధానాల అమలుతో క్రమంగా ఈ రంగం ప్రైవేటుకరించబడుతున్నదని తెలిపారు.1995 లోనే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్తు రంగాన్ని మూడు ముక్కలుగా విభజించి ప్రైవేటీకరణ వైపు ప్రభుత్వాలు అడుగులు వేశాయని పేర్కొన్నారు. అప్పుడు జెన్కోలో ప్రయివేట్ వ్యక్తులు చొరబడి ఇప్పుడు మిగతా ట్రాన్స్కో, డిస్కాంలోను కూడా ప్రవేశించుటకై ప్రస్తుతం విద్యుత్ సవరణను చట్టం బిల్లును తీసుకొస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను హరించే ఈ విధానంతో పాటు విచ్చలవిడిగా చార్జీలు పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు. తక్షణమే విద్యుత్ సవరణ బిల్లును బేషరతుగా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో అఖిల భారత రైతు -కూలి సంఘం (ఏ.ఐ.కే.ఎం.ఎస్) ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుట్టా సత్తయ్య, జ్వాలా వెంకటేశ్వర్లు, కల్లూరి అయోధ్య, నాయకులు ఇందూరు సాగర్, బొంగరాల నరసింహ, బొమ్మిడి నగేష్, అంబటి చిరంజీవి, జానపాటి శంకర్, బుడిగ శీను, తదితరులు పాల్గొన్నారు.