Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ శాసనసభ్యులు జూలకంటి
నవతెలంగాణ-నల్లగొండ
దేశభక్తి ముసుగులో నరేంద్ర మోడీ ప్రభుత్వం రంగాన్ని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు హౌల్సేల్గా అమ్మేస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. బీజేపీ మతోన్మాద, అరాచాక పాలనకు వ్యతిరేకంగా పోరాడే ప్రగతి శీల, లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో నారీ ఐలయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ పోరాటాన్ని హిందూ, ముస్లీం ఘర్షణగా వక్రీకరించి ప్రజల్లో మతోన్మాద బీజాలు నాటేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ తమకు ప్రథమ శత్రువని, దాన్ని ఓడించడమే తక్షణ రాజకీయ అవసరమని స్పష్టం చేశారు. దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను సరళీకృత ఆర్థిక విధానాల పేరుతో ప్రయివేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందన్నారు. మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాటికి కేటాయించాల్సిన బడ్జెట్ను దశలవారీగా తగ్గిస్తూ నష్టాల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఉదారంగా అమ్మేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం కోసమే మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. కేంద్ర మంత్రులు రిజర్వేషన్ల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయని కుంటిసాకులు చెప్తున్నారు కానీ రిజర్వేషన్ల వల్ల ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ దివాలా తీయలేదని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచీకరణలో భాగంగా సరళీకరణ, ఆర్థిక విధానాలు మూలంగా సహజవనరులను కారుచౌకగా దారాదత్తం చేస్తూ ప్రయివేట్ కార్పొరేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తుందన్నారు. ఈ విధానాలను ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు జరపాలని, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్తు కర్తవ్యాలను వివరించారు. నల్లగొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయాలని, అలాగే పూర్తిచేసిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేయాలని, గతంలో ఇళ్లస్థలాలకు కోసం సేకరించిన భూమిని ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించడాన్ని తప్పుపట్టారు. ఇంటి స్థలంలేని పేదలకు ఇంటి స్థలం మంజూరు చేసి ప్రభుత్వం ఇస్తానన్న ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆల్బాటంగా పంచుతున్న వృద్ధాప్య, వికలాంగుల, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్లు అర్హులైన వారందరికీ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వెంటనే ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి పంట రుణాలను విడుదల చేయాలని కోరారు. ప్రజా సమస్యల పైన రాబోయే కాలంలో ఉద్యమాలను ఉదృతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, డీ. మల్లేశం, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, కూన్రెడ్డి నాగిరెడ్డి, కందాల ప్రమీల, సయ్యద్ హాసం, చిన్నపాక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.