Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది రోజుల్లో ముగ్గురి ప్రాణాలు బలి..
- పోలీసుల సాక్షిగా.....మృతుని బంధువులపై వైద్యుల దాడి
- మాపైనే దాడి జరిగిందని వైద్యుల ఫిర్యాదు
'నేను రాను బిడ్డో ... సర్కారు దవాఖానకు' అంటూ కొన్నేండ్ల కింద ఓ సినిమాలో పాట విన్నాం.. ఆ పరిస్థితి నేడు ప్రభుత్వ దవాఖానలో కనిపిస్తుంది.ప్రభుత్వ హాస్పిటల్కు పోతే శవమై తిరిగొస్తామే తప్ప బతికి బట్టకడతామనే నమ్మకం సడలింది. అందులో భాగంగానే మొన్న బాలింత.... నిన్న శిశువు.....ఈ రెండు సంఘటనలు మరవకముందే ఇయ్యాల మరో వ్యక్తి మరణం..దీనికంతటికి కారణం వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బందువులు ఆరోపిస్తున్నారు.అయితే ఇంత జరుగుతున్న అధికారగణం మాత్రం తమ సిబ్బంది తప్పేమీలేదని సర్టిఫికెట్ ఇచ్చివెళ్లిపోతున్నారు.సకల సౌకర్యాలున్నాయి..ఉత్తమమైన చికిత్స అందిస్తు న్నామని,తమ నిర్లక్ష్యం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. మృతుని బంధువులపై వైద్యులు దాడి చేసే వరకు పరిస్థితి వెళ్లింది.ఇదంతా రక్షక భటుల సాక్షిగా హాస్పిటల్లో జరిగింది.ప్రాణం కాపాడమని వచ్చిన రోగులను వైద్యులు నిర్లక్ష్యం చేయడం, ఇదేంటని ప్రశ్నించిన బంధువులపై దాడి చేయడం, పోలీసు కేసు పెట్టడమంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. హాస్పిటల్లో వరుసగా మరణాలు...
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లా కేంద్ర వైద్యశాలలో వరుస మరణాలు జరుగుతున్నాయి.దీంతో హాస్పిటల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈనెల 17వ తేదీన కట్టంగూరు మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన అఖిల డాక్టర్ల నిర్లక్ష్యంగా కారణంగా చనిపోయారు.దీంతో బంధువులు దాదాపు మూడు రోజులుగా హాస్పిటల్లో నిరసన వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే మూడు రోజుల కింద నాలుగు రోజుల పసిపాప ఫిట్స్ వచ్చాయనే కారణంతో హాస్పిటల్లో చేరారు.వచ్చి రోజు రాత్రి సమయంలోనే బాబు చనిపోయాడు.అయితే వారం రోజులుగా మంచిగా ఉన్న బాబు హాస్పిటల్కు రాగానే ఏలా చనిపోతారని, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కూడా తమకు డాక్టర్లు తమకు చెప్పలేదని బాబు బంధువులు ఆరోపించారు.అనారోగ్య కారణంతో హాస్పిటల్ చేరిన బుచ్చిరాములు (50) బుధవారం ఆయన కుమారులు దవాఖానలో చేర్చారు.ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వైద్యులు సరైన విధంగా స్పందించలేదని ఆయన కుమారులు ఆరోపిస్తూ బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. ఒకదశలో మృతుడి బంధువులు వైద్యులపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈలోపు పోలీసులు ప్రవేశించి ఆందోళన కారులను చెదరగొట్టి, దాడికి ప్రయత్నించిన వారిని పోలీసులు పట్టుకుని వెళుతుండా వైద్యులు అతనిపై పోలీసులసాక్షిగా దాడి చేశారు.దీంతో బాధితులు మా వారిని వదిలిపెట్టండి వెళ్లిపోతామని కాళ్లు పట్టుకుని బతిమిలాడిన కనికరం చూపలేదు. పోలీసులు కూడా చూస్తు ఉండిపోయారే తప్ప వారిని కనీసం అడ్డగించలేదని ఆరోపిస్తున్నారు.
సంయనం పాటించాల్సిన వేళ దాడులా....
తమ తండ్రి చనిపోయిన ఆవేశంలో కుమారులు కొంత ఆవేదనతో దాడి చేసే ప్రయత్నం జరిగి ఉండొచ్చు.. అలాంటి వేళ సంయమనం పాటించాల్సిన వైద్యులు మృతుని బంధువులపై పోలీసుల ముందే దాడి చేయడం ఎంతవరకు సమంజసం.పదిరోజుల కింద చనిపోయిన అఖిల పట్ల వైద్యులు, సిబ్బంది చూపిన నిర్లక్ష్యం కళ్లముందే ఇంకా కనిపిస్తూనే ఉంది.. ఒక్క వైద్యుడు కూడా ఆ ఘటన పట్ల స్పందించలే. ఆ సమయంలో ఆ మహిళ బంధువులు వైద్యులపై దాడి చేయలే కదా.. న్యాయం చేయమని ఆందోళన చేశారు..మీకు మీరు విచారణ చేసుకుని 'వెరీ గుడ్' సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. అదేంత వరకు న్యాయం .. ఒకవేళ వైద్యులు బాగా పనిచేసినట్టయితే సుమారు 14మంది డాక్టర్లకు షోకాజ్ నోటీసులు ఎందుకువచ్చినట్టో ఆలోచన చేయాలే కదా... బాధలో ఉన్నప్పుడు బాదితులు కొంత ఆవేశానికి లోనవుతారూ..ఆ సమయంలో కొంత ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలే తప్ప దాడికి ప్రతిదాడి చేయడం సబబు కాదన్న విషయం మీ అందరికి తెలియని కాదు.రౌడీలు , గూండాలు దాడిచేసేందుకు వచ్చారని మాట్లాడడం విడ్డూరంగా ఉంది. చనిపోయిన మృతదేహాన్ని తీసుకుపోవ డానికి ఆలాంటి వాళ్లు వస్తరా.. ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసంగా ఉంది. ఇదిలా ఉంటే జిల్లా హాస్పిటల్లో పనిచేయాలంటే ప్రాణభయం ఉంది.ఇలాగే ఉంటే తాము వైద్యం చేయడం నిలిపివేస్తామని జిల్లా పోలీసు అధికారికి వైద్యులు చెప్పినట్టు తెలిసింది.ఒకవేళ అదే నిజమైతే...ప్రజల సొమ్ముతోనే మనం విద్యాభ్యాసం చేశామని, అందుకోసం వారికోసం పనిచేయడం అందరి బాధ్యత అన్న విషయంలో గమనంలో ఉంచుకోవాల్సి ఉంది.
జిల్లా పాలనాధికారి దృష్టి సారిస్తేనే...
నూతనంగా జిల్లా పాలనాధికారి బాధ్యతలు చేపట్టిన వినయ్కృష్ణారెడ్డి జిల్లా యంత్రాంగంపై పట్టు సాధిస్తున్నట్టు తెలుస్తుంది.ఏండ్ల తరబడి జిల్లాలోనే తిష్టవేసిన అధికారులపై ఒ కన్నేసి వారి పట్ల దృష్టి సారించినట్టు సమాచారం. వారి పని విధానాన్ని ప్రశ్నిస్తూ ఆయా శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల పరిస్థితిని ఆరా తీస్తున్నట్టు వినికిడి.ఇప్పుడు ఏ శాఖ అధికారిని మందలించిన వారి నోటి వెంట ఇదే మాట వస్తుంది. ఏ సమయంలో ఏ ప్రశ్నలు వేస్తారోననే జిల్లా అధికారులు కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది.ఇలాంటి పరిస్థితిలో గాడి తప్పిన హాస్పిటల్ వైద్యుల పనితీరుపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.ప్రభుత్వ వైద్యుల పనితీరు బాగాలేదని ఇంటలిజెన్సు ద్వారా ప్రభుత్వం నివేదిక తెప్పించుకుందని సమాచారం.అందులో 14మందికి షోకాజ్ నోటీసులు అందినట్టు తెలిసింది.అయితే వీరి నిర్లక్ష్యం వరుసగా మూడు మరణాలు సంభవించడం, మృతుడి బంధువులపై వైద్యులే దాడి చేయడం పట్ల జిల్లా కలెక్టర్ స్పందించిన ఇందులో వాస్తవాలను విచారించి దోషులను చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
దాడి చేశారంటూ డా|| శ్రీనాథ్ పోలీసులకు ఫిర్యాదు..
గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారంటూ డా|| శ్రీనాధ్ టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ వేమిరెడ్డి రాజశేఖర్రెడ్డి తెలిపారు.విచారణ చేసి వారిని అదుపులోకి తీసుకుంటానని పేర్కొన్నారు.ఒకవేళ మృతుడి బంధువులు ఫిర్యాదుచేస్తే దానిపై కూడా విచారణ చేయిస్తానని తెలిపారు.