Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మురుగు నీటి కాలువలతో తిప్పలు
- కూలిపోయే స్థితిలో కరెంటు స్థంబాలు
- 3వ వార్డు ఇరువైపుల డ్రైనేజీ వాటర్
- వ్యక్తిగత ప్లాట్ల నుండి మురుగు నీరు దారి
- వైటీడీఏ ప్రణాళికలతో స్థానికుల తలనొప్పి ఈ కష్టాలు ఎప్పుడు తీరేనో
- పరిస్థితి ఎట్ల మారేనో
నవతెలంగాణ-యాదాద్రి
యాదగిరిగుట్ట మున్సిపల్పరిధిలోని యాదగిరిపల్లి దళితులు నిత్యం ప్రమాదం అంచున ప్రయాణిస్తున్నారు.ఈ వాడకు వెళ్లే సీసీరోడ్డు దారిలో (అంటే రోడ్డు అంచనా) మురుగు నీటి కాలువ తవ్వడమే కాక కరెంటు స్తంబాలను కూడా తవ్వారు.ఇప్పుడు ఆ స్తంభాలు ఎప్పుడు కూలిపోతాయో..ఆకాలువలో పడిపోతామోనని స్థానికులు ఆందోళన పడుతున్నారు.ప్రమాదవశాత్తు ఇక్కడి విద్యుత్ స్తంభాలు కూలి జరగరానిది జరిగితే తీవ్రమైన ప్రాణ నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది. ఇది తలచుకొని రోడ్డు వెంట నడిచే పాదాచారులు, వాహనచోదకులు వణికిపోతున్నారు.స్థానిక మజీదు ముందున్న ఇండ్ల మెట్ల వరకు ఈ మురుగు నీటి కోసం కాలువను తీశారు. ఆ ఇంట్లోని వాళ్లు బయటకు రాకుండా లోనికి వెళ్లకుండా కాలువను తవ్వేశారు. ఈ పరిస్థితుల్లో తమ పిల్లలు కాలువలో పడిపోతారోనని భయంతో ఇళ్లు ఖాళీ చేసి వేరే చోట కిరాయికి ఉంటున్నట్లు స్థానికుడు బోదాసు వెంకటేష్ ఆవేదన చెందారు. కాగా ఎలాంటి ప్రమాద సూచిక బోర్డు కూడా లేదు.ఇది అధికారుల నిర్లక్ష్య దోరణికి నిదర్శనంగా ఈ కాలనీవాసులు పేర్కొంటున్నారు.ప్రమాదవశాత్తు అందులో జారీ పడితే బాధ్యత ఎవరని దళితులు ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ ప్రమాదం జరిగితే....
వైటీడీఏ నేతృత్వంలోని ప్రణాళికలు స్థానికులకు తలనొప్పిగా మారాయి.ఇప్పటికే అభివృద్ధిలో భాగంగా గండిచెరువు నుండి ఊరకుంట వరకు సుమారు 100ఎకరాల వ్యవసాయ భూములు యాదగిరిపల్లి గ్రామస్తులు కోల్సోవాల్సి వచ్చింది.అయితే వర్షపు నీరు, గండిచెరువు పక్కన ఉన్న పెద్దగుట్ట నుండి జలనీరు అలాగే కల్యాణకట్ట, అన్నదానం, లక్ష్మి పుష్కరిణితో పాటు భక్తులు వాడే ఇతరాత్ర నీరు వెళ్లడానికి డ్రయినేజీ నిర్మాణం చేపట్టారు.ఇది వరకైతే వర్షపు వరద, జలనీరు వర్షాకాలంలో మాత్రమే దిగువ ప్రాంతానికి వెళ్లి మండలంలోని వంగపల్లి చెరువులో కలిసేది.ఇప్పుడు డ్రయినేజీలో వెళ్లే మురుగు నీరు ఏడాదిపొడవునా పారుతుంది.కానీ ఈ నీరు వెళ్లడానికి ఎస్సీకాలనీ రోడ్డు అంచు నుండి అధికారులు ఒక కాలువను తవ్వారు. కానీ ఈ కాలువ వెంట ఎలాంటి ప్రమాద సూచిక బోర్డులు లేకుండా అలాగే వదిలేశారు.ఇందులో జారి పడతామోనని పలువురు వాపోతున్నారు.
వ్యక్తిగత ప్లాట్లు నుండే....
ఈ మురుగు ఇప్పుడు వ్యక్తిగత ప్లాట్ల నుండే వెళ్తోంది. ప్రణాళిక రూపకల్పన సరిగా లేకనే దళిత వాడ పూర్తిగా నీటిమయం అవుతుందని దళితులు ఆరోపిస్తున్నారు.వైటీడీఏ అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ మురుగు నీటికి దారి లేకపోవడంతో వ్యక్తిగత స్థిరాస్తులను ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఈ వాడకు రెండువైపులా వాటరే...
వర్షాకాలంలో ఈ వాడను రెండు వైపులా నీళ్లు చుట్టుముడుతాయి.యాదగిరిగుట్ట బస్టాండ్ పక్కన గల నల్ల చెరువు నుండి ఈ వాడకు దక్షిణ దిక్కు నుండి వచ్చే వరద నీటికి తోడు కొండపై నుండి వచ్చే వర్షపు నీరు అలాగే మురుగు నీరు.అదేవిధంగా ఉత్తర దిక్కు నుండి ఈ మురుగు ఈ కాలనీ తూర్పు భాగాన ఏకమవుతాయి.ప్రతేడు పంట పొలాలు పూర్తిగా ద్వంసమవుతూనే ఉంటాయి. కాగా ఈ కష్టాలే ఇలా ఉండగా..రోడ్డు పక్కన త్రవ్విన కాలువతో ఇటీవల ఈ కాలనీవాసులు నరకయాతన పడుతున్నారు. అధికారులు త్వరితగతిన ఈ కాలువను మూయించాలని కోరుతున్నారు. ముఖ్యంగా కరెంటు స్థంభాలు ఎప్పుడు కూలునోనని ఆందోళన చెందుతున్నారు.
త్వరగా పనులు చేయాలి
బోదాసు వెంకటేష్-స్థానికుడు(యాదగిరిపల్లి)
అభివద్ధికి పూర్తి సహకారం ఇస్తాం.అలా అని ఇంటి బయట నుండి కాలువను తవ్వడమే అత్యంత దారుణం.మా పిల్లలపై ఏ క్షణాన విద్యుత్స్తంభాలు కూలిపోవునోనని ఆడుకుంటూ ఈ కాలువలో ఎప్పుడు పడిపోతారని భయంగా ఉంది. అందుచేత ఇండ్లు ఖాళీ చేసి వేరేచోట కిరాయికి ఉంటున్నాం.సాధ్యమైనంత త్వరగా కాలువ నిర్మాణం పనులు పూర్తి చేయాలని వేడుకుంటున్నాం.
విద్యుత్స్తంభాలతో రోజుభయమే
బూడిద అయిలయ్య (స్థానికుడు, యాదగిరిపల్లి)
ఈ కాలువ వెంట ప్రమాదసూచిక పోవడం ఏర్పాటు చేయలేదు.పైగా ఈ కాలువలోని విద్యుత్స్తంభాలు కూలిపోతే కచ్ఛితంగా ప్రమాదం జరుగుతుంది.ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది.అదేవిధంగా రాత్రింబవళ్లు ఈ రోడ్డు వెంటనే ప్రయాణిస్తుంటాం. రెండు వాహనాలు ఎదురైనప్పుడు ఇందులో పడిపోతామనే భయం కలుగుతుంది.కావాల్సినంత త్వరగా ఈ కాలువ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నాం.