Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
పారిశుధ్యకార్మికులను వేధిస్తున్న మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ బండజనార్దన్రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు విధులను బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడారు.శానిటరీ ఇన్స్పెక్టర్ మున్సిపల్ మహిళా పారిశుధ్య కార్మికులతో ఇండ్లలో పని చేయించుకుంటూ సభ్యంగా మాట్లాడుతూ వేధిస్తుండడం సరికాదన్నారు.పారిశుధ్య కార్మికురాలు కోటమ్మను శానిటరీఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి ఇంట్లో పని చేయించుకుంటూ, కుటుంబవ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుందని తెలిపారు.మహిళల పట్ల, కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తూ వారిని వేధింపులకు గురి చేసే అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని,అలాగే అతనికి సహకరిస్తూ, పారిశుధ్య కార్మికురాలు కోటమ్మపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న డ్రైవర్ సోమయ్యను కూడా విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.పారిశుధ్య కార్మికుల పని భారం తగ్గించాలని, అవసరమైన సమయాల్లో సెలవులు మంజూరు చేయాలని కోరారు.కమీషనర్ చాంబర్ వద్ద ఆందోళన చేస్తున్న సీఐటీయూ నాయకులు,జవాన్లు, కార్మికులతో మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి చర్చించారు.ఈ సమయంలో కమిషనర్‌కు బాధిత పారిశుధ్య కార్మికురాలు కోటమ్మ తన గోడు వెళ్లబోసుకున్నది.కమిషనర్ మాట్లాడుతూ కార్మికులు తమ సమస్యలు ఏవైనా తనకు నేరుగా చెప్పాలని,ఆందోళనలు వద్దని చెప్పారు.దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోటగోపి,సీఐటీయూ టౌన్ కన్వీనర్ మామిడి సుందరయ్య, మున్సిపల్ యూనియన్ నాయకులు చాగంటి వెంకటరమణ, ఓగోటి దశరథ, బండారుపెద్ద మురళి, కూరపాటి మారయ్య,శివ, నాగమణి ,ఎల్లమ్మ, వెంకటమ్మ, శ్వేత, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.