Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-త్రిపురారం
కార్మిక చట్టాల సవరణను సహించమని, వెంటనే ఆచట్టాలను ఉపంసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. త్రిపురారం మండలం లోని పెద్దదేవలపల్లిలో జరిగిన రెడ్డి ల్యాబ్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా కుదించి పని గంటల దినాన్ని పెంచి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను సవరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఆగిన పరిశ్రమలను నడిపించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అనేక వాగ్దానాలు చేసి ఆచరణలో పూర్తిగా విస్మరించారని విమర్శించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఆహార అలవాట్లపై ఆంక్షలు విధించటం అధికారమే లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేస్తూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని, దీనిని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు గమనిస్తున్నారని రానున్న కాలంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అనంతరం రెడ్డి ల్యాబ్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు, రెడ్డి స్లాబ్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్. సుధాకర్, రమణ, కుంచం లింగయ్య, సిహెచ్ రామయ్య', రాములు, నరసారెడ్డి, చామంతి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.