Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రమణ
నవతెలంగాణ-ఆత్మకూరుఎస్
లిక్కర్, శీతల పానీయాలతో అంతరించిపోతున్న కల్లుగీత వృత్తికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించి,వృత్తిలో ఉన్న వారికి ఉపాధి కల్పించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రమణ డిమాండ్ చేశారు.గురువారం మండలపరిధిలోని నెమ్మికల్ శుభం ఫంక్షన్హాల్లో జరిగిన ఆ సంఘం జిల్లా 2వ మహాసభలో ఆయన మాట్లాడారు.గ్రామాల్లో కల్లు గీతవృత్తికి ప్రాధాన్యత లేక వృత్తిని నమ్ముకునేవారు ఉపాధి లేక ఊరువదిలి పట్టణాలకు వెళ్తున్నారన్నారు.ఇతర ప్రాంతాల్లోకి వలసెళ్లి ఇతరవృత్తుల్లో ఇమడ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.కల్లుగీత వృతినే నమ్ముకుని జీవిస్తున్న వారు తరుచు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు.వృత్తినే నమ్ముకున్న వారికి ఉపాధి కల్పించాలన్నారు.కల్లుగీతవృత్తి కోసం మొక్కల పెంపకానికి ప్రభుత్వం భూమిని ఇచ్చి కల్లుకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.వృత్తిని ఆధునీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని డిమాండ్ చేశారు.ఈ మహాసభకు మండలం నుండి కాకుండా జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల నుండి గీతకార్మికులు భారీగా ర్యాలీగా వచ్చారు.కొందరు గీత కార్మికులు మోకుముస్తాదు వేషధారణతో ప్రదర్శనగా మహాసభకు హాజరయ్యారు.అనంతరం మండలకేంద్రంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎలుగూరి గోవింద్, జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షులు అబ్బగాని భిక్షంగౌడ్, ఉయ్యాలనగేష్, కృష్ణ, మడ్డిఅంజయ్య, బోడపట్ల జయమ్మ,జెర్రిపోతులకృష్ణ, బెల్లంకొండ ఇస్తారి, నోముల వెంకన్న, తండురమేశ్, సురుగు రమేశ్, దేవుడు లింగయ్య, గుండు లింగయ్య, సిగ వెంకటయ్య, భయ్యా సోమన్న, శ్రీను,వెంకన్న పాల్గొన్నారు.