Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలదిగ్భంధనమైన 60 ఫీట్ల రోడ్డు, అక్రమ కట్టడాలతో రోడ్లపై నిలిచిన వరద నీరు
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి చిరు జల్లులతో ప్రారంభమైన వర్షం క్రమంగా పెరిగి ఏకధాటిగా మూడున్నర గంటల పాటు దంచి కొట్టింది.గురువారం తెల్లవారుజామున వరకు కురిసిన భారీ వర్షానికి పట్టణం అతలాకుతలం అయింది. ప్రధానంగా 60 ఫీట్ల రోడ్డు జలదిగ్బంధంలో చిక్కింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా,కొన్ని ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరొచ్చి చేరడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. 60 ఫీట్ రోడ్డు నాలా నీట మునిగి సమీప 37,34,46,47 వార్డుల్లో నీరు చెరువులను తలపిస్తుంది.మున్సిపల్ అధికారులు ఉదయం నుండే పలు ప్రాంతాలను సందర్శించి,నివారణ చర్యలు చేపడుతున్నారు.సూర్యాపేట 60 ఫీట్ రోడ్డు ఎగువ భాగం నుండి వరద ప్రవాహం భారీగా పెరగడంతో 60 ఫీట్ రోడ్డు నాలా పొంగిపొర్లి సమీప వార్డులను నీటితో ముంచెత్తింది.అర్ధరాత్రి కావడంతో మున్సిపల్ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశాలతో తెల్లవారు జాము నుండి నీటి ప్రవాహంలో ఆటంకాలను తొలగించే పనులను మొదలుపెట్టారు మున్సిపాలిటి అధికారులు. ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద వస్తుండటంతో నీట మునిగిన కాలనీలు వరద నుండి బయటపడేందుకు ఇంకా సమయం పట్టె అవకాశం ఉందని తెలుపుతున్నారు.అనుమతులు లేకుండా అక్రమంగా ఇండ్ల కట్టడాలు చేపట్టడంతో కురిసిన భారీ వర్షాలకు వరద నీరంతా రోడ్లపై నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.60 ఫీట్ల రోడ్డుకు ఇరువైపులా అనుకోని ఉన్న వార్డులలో వరద నీరు రోడ్లపై చేరి నివాసాలలో గల ప్రజలు బయటకి రాని దుస్థితి నెలకొంది.నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లాలంటే ఇదే వార్డులో గల 60 ఫీట్ల ఎక్స్చేంజ్ రోడ్ల గుండా వెళ్లాల్సి ఉంది. కానీ వరద నీటిలో రోడ్డు కనుమరుగైంది.పట్టణంలోని కొన్ని చోట్ల రోడ్ల పైకి వరద నీరు భారీగా చేరింది.లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్,కమిషనర్ సత్యనారాయణరెడ్డి పరిశీలించారు.సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ప్రతి సారి ఇదే తంతు....
ప్రతిసారి ఇదే తంతు జరుగుతున్నా శాశ్వత పరిష్కారంపై అధికారులు, పాలకులు దృష్టి పెట్టక పోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.