Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ కూడా నర్సరీలో వాచర్..!
-10 అంబులెన్స్‌ల యజమాని కూడా ఉపాధికూలీయే
నవతెలంగాణ నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
చింతపల్లి మండలంలోని ఉపాధి హామీ చట్టంలో చేపడుతు న్న సామాజిక తనిఖీలో భాగంగా చేపట్టిన విచారణలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటు న్నాయి. గ్రామంలో నివాసం లేనివాళ్లు, 80 ఏండ్లు ఉండి మంచానికే మంచానికే పరిమిత మైన వృద్ధురాలు కూడా పనులకు హాజరైందని, గ్రామసర్పంచ్ కూడా నర్సరీలో వాచర్‌గా పని చేస్తున్నట్టు రికార్డులు సృష్టించడ మంటే ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
మండంలోని అన్ని గ్రామాలలో నాలుగు రోజులుగా ఉపాధి పనులపై ఆడిట్ జరుగుతుంది.2019-20, నుంచి 2021-2022 వరకు జరిగిన పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఆ మండలంలో సుమారు 35 గ్రామాలున్నాయి. అందులో మొత్తం 11878 జాబ్‌కార్డులు ఉండగా కూలీలు 33283 మంది ఉన్నారు. అయితే ప్రస్తుతం 8110 కార్డులకు సంబంధించిన కూలీలు 16654 మంది పనికి రోజు వెళ్తున్నారు.మూడేండ్ల కాలంలో జరిగిన పనులు వాటికి కేటాయించిన నిధులు, అవి సక్రమంగా వినియోగించారా లేదా అనే అంశాలపై సామాజిక తనిఖీ బృందం ఆడిట్ చేపట్టింది. ఈ తనీఖీలో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. దాదాపు రూ.50లక్షల వరకు అవినీతి జరిగినట్టు తెలిసింది.
మండలంలోని ఉమ్మాపురం గ్రామంలో దాదాపు 254 జాబ్‌కార్డులున్నాయి. కూలీలు సుమారు 700లకు పైగా ఉన్నట్లు సమాచారం.ఈ ఒక్క గ్రామంలో నాలుగు రోజులుగా చేపట్టిన సామాజిక తనిఖీలో దాదాపు రూ.4లక్షలకు పైగా నిధులు దుర్వినియోగమైనట్టు తెలిసింది.వృద్ధాప్యంలో ఉన్నవారు, హైదరాబాద్‌లో నివాసం ఉన్నవాళ్లు, క్యాన్సర్ వ్యాదితో బాధపడుతున్న వ్యక్తులు, ఆఖరికి ఆ గ్రామానికి చెందిన సర్పంచ్ కూడా ఉపాధిహామీలో కూలీగా పనిచేస్తున్నట్టు ఆ గ్రామానికి చెందిన ఉపాధి హామీ అధికారి రికార్డులు నమోదు చేసినట్టు తెలుస్తుంది.
వాటిలో కొన్ని మచ్చుకు ఇలా ఉన్నాయి.
- ఉమ్మపురం గ్రామానికి చెందిన ప్రథమ పౌరుడు ( సర్పంచ్) కేశగోని సత్తయ్య. ఆయన పేరుతో జాబ్‌కార్డు ఉంది. అతను నర్సీరీలో వాచర్‌గా పనిచేశారని రూ.15వేలు సొమ్మును డ్రా చేసినట్టుగా రికార్డుల్లో నమోదు చేశారు.
-పగడాల మంజు, పగడాల శ్రీను వీరిద్దరికి జాబ్‌కార్డులున్నాయి. వీరిద్దరి పేరుతో రూ.6వేలు డ్రా చేశారు. కానీ వీరు ఈ గ్రామానికి చెందినవారే కాదు.
-రొక్కం పెంటమ్మ వృద్దురాలు, నడవడానికే వీలుకాదు.. కానీ ఈజీఎస్‌లో పనిచేసిందని రూ.16వేలు డ్రా చేశారు.
- క్యాన్సర్ బాదితుడైన రొక్కం చిన్న నర్సిరెడ్డి ఈజీఎస్‌లో పనిచేసినట్లుగా రూ.13వేలు నిధులు మెక్కేశారు. ఇతను నెల రోజుల కింద మరణించాడు.
- హైదరాబాద్‌లో నివాసముండే అల్వాల ప్రమీల నర్సరీలో పనిచేసిందని సుమారు రూ.27వేలు నిధులు మింగేసినట్టు తెలుస్తుంది.
- 10 అంబులెన్సులకు యాజమాని అయిన బొత్స అంజయ్య ఉపాధికూలీగా పనిచేశారని రూ. 5500 సొమ్ము డ్రా చేశారు.
- హైదరాబాద్‌లోనే ఉంటూ మూడేండ్లుగా సొంత గ్రామానికి రాని కంచుకట్ల ఎల్లమ్మ ఈజీఎస్‌లో పనిచేసిందని రూ.17వేలు డ్రా చేశారు.అంతేగాకుండా కంచుకట్ల వెంకటయ్య హైదరాబాద్‌లోనే నివసిస్తుంటారే కానీ గ్రామానికి రారు. కానీ ఆయన పేరుతో సుమారు రూ.4వేలు డ్రా చేశారని తెలిసింది.
- వీరిలో డబుల్ బిల్లులు ఉన్నవాళ్లు కూడా ఉన్నారని తెలిసింది. ఈ గ్రామంలో ఇలాంటి అక్రమంగా రికార్డులు ఉన్నవాళ్లు దాదాపు 20మందికిపైగా ఉంటారని తెలిసింది. చింతపల్లి, కుర్మేడు, ఇంజమూరు, కుర్మంపల్లిలతోపాటుగా మండలంలోని అన్ని గ్రామాలలో రూ.లక్షల్లోనే ఉపాధినిధులు దుర్వినియోగమైనట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఆడిట్ అయిపోయిందని, ఇక తమనేవరేమి చేయలేరని సంబందిత అధికారులు ఆయా గ్రామాలకు సంబంధించిన కొంతమందితో వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం.