Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్
నవతెలంగాణ-మునుగోడు
తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమల అభివృద్ధి కోసం గొర్రెల సంపద పెంపు కోసం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అనేక అక్రమాలు, అవినీతి జరుగుతుందని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో నగదు బదిలీ ద్వారా గొర్రెల కాపరుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గొర్రెల పంపిణీ మొదటి విడతలో నిజమైన లబ్ధిదారులకు మేలు జరగకుండా కొంతమంది ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 11 వేల కోట్లు ఖర్చు చేస్తూ గొల్ల కురుమల కోసమే ఈ పథకం తీసుకొచ్చినట్టుగా ప్రచారం చేస్తూ ఆచరణలో నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వం చెప్పిన పద్ధతుల్లో అమలు జరుగుతుందా లేదా అనే విషయాల్లో ఒక్కసారైనా ముఖ్యమంత్రి సమీక్షించకపోవడం ఈ పథకం పట్ల ఉన్న ఉద్దేశం అర్థం అవుతుందన్నారు. కేవలం ఉప ఎన్నిక వచ్చినప్పుడే హడావిడి చేస్తున్నారు తప్ప రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయట్లేదని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా గొల్ల కురుమల కోసమే ఖర్చు చేయాలనుకుంటే లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమచేయాలన్నారు. 2018 నుంచి గొల్ల కురుమల ఓట్లు వేయించుకోని లబ్దిపోందారని, మునుగోడు నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో గొల్ల కురుమల ఓట్లు పొందాలంటే తక్షణమే లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, జీఎంపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, జీఎంపీఎస్ రాష్ట్ర నాయకులు బండారు నరసింహ, జిల్లా నాయకులు సాగర్ల మల్లేష్, వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్, డోలు దెబ్బ నాయకులు మాల్గా యాదయ్య, బీఎస్పీ నాయకులు శంకర్, గీత సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ధనంజరు, జీఎంపీఎస్ నాయకులు కొండే శ్రీశైలం, నెల్లికంటి నరసింహ, తదితరులు పాల్గొన్నారు.